- 21 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్
- దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్రం
- ఢిల్లీలోని అమెరికన్ డిప్లమాట్‌కు సమన్లు
మస్కట్: ఒమన్ తీరంలో బుధవారం ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ వెల్లడించింది. షిప్ నుంచి 21 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్టు తెలిపింది. అంతకుముందు ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలోని అమెరికన్ డిప్లమాట్‌కు సమన్లు జారీ చేసింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ‘సెట్టెబెల్లో’ అనే చమురు ట్యాంకర్ ఇంజిన్ గదిని క్షిపణి తాకడంతో నౌకలో మంటలు చెలరేగాయి. పలావు జెండాతో ఉన్న ఈ నౌకలో 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 24 మంది ఇండియన్లు ఉన్నారు. ఒమన్ దేశపు సోహార్ ఓడరేవుకు ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. ఆ సమయంలో నౌక నుంచి అత్యవసర సహాయం కోరుతూ సిబ్బంది సందేశం పంపారు. గల్లంతు అయినవారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని, దీనిపై ఒమన్ అధికారులతో కలిసి మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ సమన్వయంతో పని చేస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది.
అంతేకాదు, ఈ ఘటనపై స్పందిస్తూ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శి నాగరాజ్ నాయుడు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో చార్జ్ డి అఫైర్స్‌గా విధులు నిర్వహిస్తున్న జేసన్ మీక్స్‌కు సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత ఈ దాడిపై అమెరికా నోరు విప్పింది. ఇరాన్‌పై కొనసాగుతున్న సముద్ర దిగ్బంధనంలో భాగంగా మంగళవారం రాత్రి 11 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) సెట్టెబెల్లోపై దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. తమ దళాల ఆదేశాలను షిప్‌లోని సిబ్బంది పాటించకపోవడంతోనే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఓడ ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించినట్టు వెల్లడించింది.
