
లక్నో: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై జరిగిన దాడిపై స్పందించేందుకు పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ కలుగజేసుకుని చర్చించడానికి ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని తెలిపారు. గురువారం లక్నోలో అర్వింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఈ అంశంపై రాజకీయాలు చేయొద్దని కోరారు.‘మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించారు.
లైంగిక దౌర్జన్యం కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన దేశం నుంచి పారిపోయేందుకు బీజేపీ సహాయం చేసింది. జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసనకు స్వాతి మలివాల్ మద్దతు ప్రకటిస్తే పోలీసులు ఆమెను కొట్టారు. వీటన్నింటిపై ప్రధాని మోదీ ఇప్పటి వరకు మౌనం వహించారు. రాజకీయాలు చేయకండి. ఆప్ అనేది ఒక కుటుంబం. మా పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
స్వాతి మలివాల్‌కు ప్రియాంక గాంధీ మద్దతు
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కు గురువారం మద్దతు ప్రకటించారు. ‘‘మహిళలపై ఎక్కడైనా ఆఘాయిత్యాలు జరిగితే వారికి అండగా నిలుస్తాను. వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికి నేను వారికి అండగా ఉంటాను. ఈ విషయంపై ఆప్ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది. అది వారి ఇష్టం”అని తెలిపారు.
మలివాల్ స్టేట్ మెంట్ రికార్డు
ఆప్ ఎంపీ స్వాతిమలివాల్ పై దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆమె స్టేట్మెంట్ను నమోదు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని ఆమె నివాసంలో ఇద్దరు సభ్యుల బృందం ఆమె వాంగ్మూలాన్ని తీసుకుంది. -