కేటీఆర్, కవిత అనుచరులే దాడి చేసిన్రు : తీన్మార్ మల్లన్న

కేటీఆర్, కవిత అనుచరులే దాడి చేసిన్రు  : తీన్మార్ మల్లన్న

తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి జరిగింది. దాదాపు 25 మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఫిర్జాదిగూడలోని ఆఫీస్ లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఘటనపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు తీర్మార్ మల్లన్న.. క్యూన్యూస్ ఆఫీస్ కి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకర్నీ పట్టుకొని స్థానికులు చితకబాదినట్లు తెలుస్తోంది.  మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్, కవిత అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని మల్లన్న టీమ్ తెలిపింది.  దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లన్న టీమ్  డిమాండ్ చేస్తోంది. 

తాను బయటకు వెళ్లినప్పుడు వచ్చి ఆఫీసుపై  దాడి చేశారని తీన్మార్ మల్లన్న తెలిపారు. బీఆర్ఎస్ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని  మలన్న ఆరోపించారు. నెంబర్ ప్లేట్ లేని మూడు కార్లలో వచ్చి  దాడి చేశారని మల్లన్న చెప్పారు.  పోలీసులకు తెలిసే దాడి జరిగిందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందన్నారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఒక్కర్ని కూడా పోలీసులు  పట్టుకోలేదని మల్లన్న అన్నారు. నాలుగు సార్లు క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి జరిగినా... వార్తలు ఆగలేదన్నారు. ఆఫీసు ఖాళీ చేయించాలని తమ  ఆఫీసు ఓనర్ ను పోలీసులు బెదిరిస్తున్నారని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు.