నిత్యం యువతులపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పలు చట్టాలు తీసుకువచ్చినప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. కళాశాలల్లో యువతులపై లైoగిక వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గృహహింస గురించి ఇక చెప్పనవసరం లేదు. గతంలో మహిళలపై యాసిడ్ దాడులు జరిగేవి. ఇప్పుడు ఏకంగా వారిని హత్యలు చేస్తున్నారు. సైకాలజీ ప్రకారం ఆడ, మగ వారి మధ్య చిన్న వయసులో ఏర్పడే ప్రేమని క్రష్ లవ్‌గా పేర్కొంటారు. ఈ వయసులో ఉన్నవారికి ప్రతీది ఆకర్షణీయంగా కన్పిస్తుంది. తమకు దక్కనిది మరెవరికి దక్కకూడదనే ధోరణి నేటి యువతలో బాగా కన్పిస్తుంది.
ఫలితంగా యువతులపై ప్రేమోన్మాదంతో దాడులు చేస్తున్నారు. నిర్భయ చట్టాలొచ్చినా మహిళల స్థితిగతుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. మగపిల్లలకు వారి తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో కొందరు యువకులు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు.యవ్వనంలో ప్రేమ పేరుతో విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ప్రేమించడం నేరం కాదు. కానీ, ప్రేమని అంగీకరించకపోతే యువతులపై దాడి చేయడం మాత్రం ఖచ్చితంగా నేరమే. ఇటువంటి పరిస్థితులలో విద్యాలయాలలో యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు లైంగిక విద్యపై అవగాహన కల్గించాలి. ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండేటట్లు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చొరవ తీసుకోవాలి. హార్మోన్స్ ప్రభావంతో పరస్పర ఆకర్షణ సహజంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని పిల్లలకి తెలియచెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సచివాలయాలలో మహిళా సంరక్షణ అధికారులని నియమించింది. తెలంగాణ రాష్ట్రం మహిళల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేసింది.మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు యాప్స్ రూపొందించాయి. వీటిని సద్వినియోగం
చేసుకోవాలి.
- యమ్. రామ్ ప్రదీప్,
తిరువూరు
