ఆర్టీసీ రూట్లు ప్రైవేటుకు..మనోళ్లు నడపరు ఏపీని నడపనివ్వరు

ఆర్టీసీ రూట్లు ప్రైవేటుకు..మనోళ్లు నడపరు ఏపీని నడపనివ్వరు
  • చెరో సగం దూరం తిప్పుకొందామన్నా వినట్లే..
  • ఈ తీరుతో ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌కు లబ్ధి
  • ఇలాగైతే ప్రయాణికుల జేబులు గుల్ల
  • ఇప్పటికే బస్సులు నడవక ప్రైవేట్​లో డబుల్‌‌ చార్జీల వసూలు
  • తెలంగాణ బస్సులు తిప్పితే ఇన్​కం పెరుగుతుందన్న ఆర్టీసీ కార్మికులు

హైదరాబాద్, వెలుగుతెలంగాణ, ఏపీ మధ్య ఇంటర్‌‌ స్టేట్‌‌ బస్సుల లొల్లి ప్రైవేటు ట్రావెల్స్​కు రెడ్​కార్పెట్​ పరుస్తోంది. ఏపీ ఎక్కువగా తిప్పుతున్న బస్సు సర్వీసులను తగ్గించుకోవాలంటూ తెలంగాణ పట్టుపట్టడం, టీఎస్​ ఆర్టీసీ సర్వీసుల్నే పెంచుకోవాలని ఏపీ సూచించినా పట్టించుకోకపోవడం ‘ప్రైవేటు’కు రూట్​ వేస్తోంది. రెండు రాష్ట్రాలు కలిపి నాలుగు లక్షల కిలోమీటర్లు బస్సులు తిప్పాల్సి ఉండగా.. మూడు లక్షల కిలోమీటర్లకే పరిమితం కానున్నాయి. మిగతా లక్ష కిలోమీటర్లు ప్రైవేటు ట్రావెల్స్​చేతిలోకి వెళ్లిపోనున్నాయి. అసలు ప్రైవేటుకు మేలుచేసేందుకే, లోపాయికారీ ఒప్పందాలతోనే తెలంగాణ సర్కారు మొండిగా వ్యవహరిస్తోందని ఆర్టీసీ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. లాభాలొచ్చే ఈ రూట్లలో టీఎస్​ ఆర్టీసీ సర్వీసులను పెంచుకుంటే.. ఆదాయం పెరిగి, సంస్థ నష్టాలు తగ్గిపోయేవని అంటున్నాయి. మరోవైపు ఆర్టీసీ సర్వీసులు తగ్గిపోవడం ప్రయాణికులకు తిప్పలు తేనుంది.ఇప్పటికే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్​.. ఇక అందినకాడికి దోచుకుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏడు నెలలుగా బస్సుల్లేక..

కరోనాతో లాక్‌‌ డౌన్‌‌ మొదలైనప్పటి నుంచి తెలంగాణ, ఏపీ మధ్య ఏడు నెలలుగా బస్సులు నడవడం లేదు. అన్‌‌లాక్‌‌లో భాగంగా ఇంటర్​ స్టేట్​సర్వీసులకు కేంద్రం సడలింపులు ఇచ్చినా సర్వీసులు స్టార్ట్​ చేయలేదు. ఇంటర్​స్టేట్​ అగ్రిమెంట్​ లేదంటూ రాష్ట్ర సర్కారు బస్సులు ఆపేసింది. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటై ఆరేండ్లు గడుస్తున్నా.. ఏపీతో ఇంటర్‌‌ స్టేట్‌‌ అగ్రిమెంట్‌‌ జరగలేదు. కరోనాతో బస్సులు ఆగిపోవడంతో.. ఇప్పుడు అగ్రిమెంట్‌‌ చేసుకోవాలని మన సర్కారు భావించింది. దీనిపై సీఎం కేసీఆర్‌‌  ఆర్టీసీ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్ని బస్సులు తిప్పితే.. ఏపీ కూడా అన్నే బస్సులు తిప్పాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య 4 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు నడుస్తున్నాయి. అందులో తెలంగాణ భూభాగంలో ఏపీ బస్సులు 2.64లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. ఏపీ భూభాగంలో తెలంగాణ బస్సులు 1.61 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఏపీ బస్సులు తెలంగాణలో లక్ష కిలోమీటర్ల మేర ఎక్కువగా నడుస్తున్నాయి.

నాలుగు సార్లు చర్చించినా ముడివడనియ్యలె..

ఇంటర్‌‌ స్టేట్‌‌ అగ్రిమెంట్‌‌ చేసుకుంటెనే బస్సులు రోడ్డెక్కుతాయని మన సర్కారు స్పష్టం చేయడంతో.. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు పలుసార్లు భేటీ అయ్యారు. ఏపీలో ఒకసారి, తెలంగాణలో మూడుసార్లు హైలెవల్​ చర్చలు జరిగినా.. స్వయంగా రెండు ఆర్టీసీ ఎండీల భేటీ జరిగినా ఎటూ తేలలేదు. తాము లక్ష కిలోమీటర్లు ఎక్కువగా తిప్పుతున్నందున.. అందులో 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, తెలంగాణ 50వేల కిలోమీటర్లు పెంచుకోవాలని ఏపీ ప్రతిపాదించింది. అయినా మన రాష్ట్ర సర్కారు ఒప్పుకోలేదు.

ఏపీ దిగొచ్చినా..

బస్సు సర్వీసుల విషయంగా తెలంగాణ మొండిపట్టు పట్టడంతో ఏపీ సర్కారు కొంత వెనక్కి తగ్గింది. లక్ష కిలోమీటర్ల మేర సర్వీసులు తగ్గించుకోవడానికి సిద్ధమైనట్టు తెలిసింది. కరోనాతో నష్టం, దసరా రద్దీ, ఇప్పటికే కోల్పోయిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఏయే రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే లిస్ట్‌‌ కూడా రెడీ చేసుకుంటున్నట్టు తెలిసింది. కానీ తెలంగాణ సర్కారు మాత్రం ఏమీ తేల్చడం లేదు. ఇలా ఇరు రాష్ట్రాల మధ్య పంచాయితీతో.. ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌కు కలిసొస్తుందని ఇటీవలి చర్చల సందర్భంగా ఏపీ అధికారులు బహిరంగంగానే పేర్కొన్నారు.

ప్రైవేటుకు అప్పగిస్తే దోపిడే..

ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరక, బస్సులు తిరగకపోవడంతో.. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే ఇష్టమొచ్చినట్టుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో టికెట్‌‌పై 150 నుంచి రూ. 400 దాకా అదనంగా తీసుకుంటున్నారు. లాక్‌‌డౌన్‌‌ కంటే ముందు ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌లో విజయవాడకు నాన్‌‌ ఏసీ అయితే రూ. 350 తీసుకునేవారు. ఇప్పుడు రూ.500పైనే తీసుకుంటున్నారు. జనరల్‌‌ ఏసీ అయితే రూ. 420, సెమీ స్లీపర్‌‌ అయితే రూ. 550 వరకు తీసుకునేవారు. ఇప్పుడు ఏడెనిమిది వందలకుపైగా చార్జీ చేస్తున్నారు. తిరుపతి, వైజాగ్​కు కూడా ఇలాగే అదనంగా తీసుకుంటున్నారు. ఇలాంటిది లక్ష కిలోమీటర్ల మేర సర్వీసులను ప్రైవేటుకు అప్పజెప్తే.. ఈ దోపిడీ మరింత పెరిగిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. సాధారణంగానే ప్రైవేటు ట్రావెల్స్​పై పెద్దగా నియంత్రణ ఉండదని.. పండుగల టైంలో అడ్డగోలుగా వసూళ్లు చేస్తుంటే ఎవరూ పట్టించుకోరని అంటున్నారు.

ఆ లక్ష కిలోమీటర్లు ప్రైవేటుకే?

రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వదిలేసుకునే లక్ష కిలోమీటర్ల సర్వీసులు ప్రైవేటు చేతికి వెళ్లనున్నాయి. ఏపీ బస్సులు తిరగకుండా ఆపడం, తెలంగాణ బస్సులు నడిపించకపోవడంతో.. ప్రయాణికుల డిమాండ్​కు తగినట్టుగా బస్సులు అందుబాటులో ఉండవు. లక్ష కిలోమీటర్ల సర్వీసులు తగ్గడం అంటే సుమారు 500 బస్సులు తగ్గిపోతాయి. ఈ లెక్కన రోజుకు 20 వేల మందికిపైగా జర్నీకి ఇబ్బంది అవుతుంది. కొత్తగా మరికొందరు ప్రైవేటు ఆపరేటర్లు స్టేజీ క్యారియర్ బస్సుల కోసం అప్లై చేసుకుంటారు. రాష్ట్ర సర్కారు ముందుగా ఈ లెక్కలన్నీ వేసుకుందని, ప్రైవేటుకు లాభం కలిగేందుకే ఏపీకి కండీషన్లు పెడుతోందని ఆర్టీసీ యూనియన్లు ఆరోపిస్తున్నాయి.

మేఘాకు మేలు కోసమేనా?

హైదరాబాద్​కు వచ్చే ఏపీ బస్సులను, ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సులను తగ్గించడం వెనుక మేఘా కంపెనీకి ప్రయోజనం కలిగించే కుట్ర ఉందని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటుపరం చేస్తే.. సర్వీసులు నడిపేందుకు మేఘా ఏడాది కిందటే రెడీ అయింది. అందుకు బస్సులను కూడా సిద్ధం చేసుకుందని ప్రచారం జరిగింది. ఎక్కువ లాభాలొచ్చే రూట్లు అయిన హైదరాబాద్– విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతితోపాటు పలు పెద్ద పట్టణాలకు బస్సులు నడిపేందుకు ముందుకొచ్చింది. కానీ తీవ్ర విమర్శలు రావడంతో అప్పట్లో రూట్ల ప్రైవేటీకరణ నిలిచిపోయింది.

ఆదాయం వచ్చే రూట్లలో ఎందుకు నడపరు?

ఫస్ట్​ ప్రజలకు ఇబ్బంది లేకుండా సర్వీసులు ప్రారంభించే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ రెండు మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. లాంగ్‌‌ రూట్లలో హై ఎండ్‌‌ బస్సుల్లో మంచి ఆదాయం వస్తుంది. దాన్ని ఎందుకు వదులుకోవాలి. అవసరమైతే సంస్థలోని కొన్ని బస్సులను ఈ రూట్లకు తిప్పొచ్చు.

– వీఎస్‌‌ రావు, ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌‌, జనరల్‌‌ సెక్రటరీ

ప్రైవేట్​కు అప్పజెప్పే కుట్ర

తెలంగాణ కంటే ఏపీ లక్ష కిలోమీటర్లు అదనంగా బస్సులు నడుపుతోంది. ఇప్పుడు 50 వేల కిలోమీటర్లు తగ్గుతామని, తెలంగాణను 50 వేల కిలోమీటర్లు పెంచుకోవాలని ప్రతిపాదించింది. అయినా తెలంగాణ మొండిగా వ్యవహరిస్తోంది. లక్ష కిలోమీటర్లు సర్వీసులు తగ్గితే ఎట్లా భర్తీ చేస్తరు. ప్రయాణికులు ఎలా జర్నీ చేయాలి. ఇది ప్రైవేట్‌‌కు అప్పజెప్పే కుట్ర. సమ్మె టైంలోనే ప్రైవేట్‌‌ అప్పగించాలనే ప్రయత్నాలు చేశారు. ఇది సరికాదు.

– కె. రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్‌‌ సెక్రటరీ