
హైదరాబాద్, వెలుగు: హెచ్‌సీఎల్ సైక్లథాన్ రెండో ఎడిషన్ నవంబర్ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఎడిషన్ విజేతలకు రూ. 33.6 లక్షల భారీ ప్రైజ్‌మనీ ఉంటుందని ఆర్గనైజర్స్ మంగళవారం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) తో కలిసి హెచ్‌సీఎల్ నిర్వహించే సైక్లథాన్ ఈవెంట్ జెర్సీని సీఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్ మనీందర్ సింగ్‌తో కలిసి రాష్ట్ర క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆవిష్కరించారు. సైక్లింగ్‌ను ప్రోత్సహించడంలో హైదరాబాద్ ముందుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు నెగ్గేలా స్లైక్లింగ్ సహా 15 ఆటలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రొఫెషనల్స్, అమెచ్యూర్, గ్రీన్ రైడ్ అనే మూడు కేటగిరీల్లో నిర్వహించే సైక్లథాన్ లో పాల్గొనేందుకు అక్టోబర్ 26 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చని హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రతినిధి రజత్ చందోలియా చెప్పారు.