జాగ్రెబ్ (క్రొయేషియా): వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా యంగ్ రెజ్లర్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన విమెన్స్ 65 కేజీ క్వార్టర్ ఫైనల్లో వైష్ణవి పాటిల్ 2–4తో వరల్డ్ ఐదో ర్యాంకర్ ఎన్కిజిన్ తువిషింజార్గల్ (మంగోలియా) చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్స్‌లో 3–1తో ఎల్మా జైడ్లెర్ (లాత్వియా)ను ఓడించింది. 76 కేజీల బౌట్‌లో ప్రియా మాలిక్ 2–4తో జెనెసిస్ రియాస్కో వాల్డెజ్ (ఈక్వెడార్) చేతిలో పరాజయం చవిచూసింది. ఒకవేళ వాల్డెజ్ సెమీస్‌కు చేరితే ప్రియాకు రెప్‌ఛేజ్ ఆడే చాన్స్ వస్తుంది.
50 కేజీల క్వాలిఫికేషన్స్‌లో అంకుష్ 5–6తో నటాలియా వారకినా (బల్గేరియా) చేతిలో, 57 కేజీల్లో తపస్య గెహ్లావట్ 2–4తో బెర్తా రోజాస్ చావెజ్ (మెక్సికో) చేతిలో ఓడారు. తర్వాతి రౌండ్లలో నటాలియా, చావెజ్ పరాజయం చవిచూడటంతో ఇండియన్ రెజ్లర్లకు రెప్‌ఛేజ్ ఆడే అవకాశం కూడా రాలేదు. మెన్స్ ఫ్రీస్టయిల్‌లో సుజీత్ కల్కల్ (65 కేజీ), విక్కీ (97 కేజీ) రెప్‌ఛేజ్‌లో నిరాశపర్చారు. సుజీత్ 5–7తో రియల్ మార్షల్ రే వుడ్స్ (అమెరికా) చేతిలో, విక్కీ బైఫాల్ ద్వారా అఖ్మద్ మగమావ్ (బల్గేరియా) చేతిలో ఓడారు.
