టీచర్లకు చాడీలు చెబుతున్నారని.. తోటి విద్యార్థులపై దాడి

టీచర్లకు చాడీలు చెబుతున్నారని.. తోటి విద్యార్థులపై దాడి
  • మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర జ్యోతిబా పూలే గురుకులంలో ఘటన

చిన్నచింతకుంట, వెలుగు: తమపై టీచర్లకు చాడీలు చెబుతున్నారని కొందరు స్టూడెంట్లు తోటి విద్యార్థులపై దాడి చేసిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో జరిగింది. గురుకుల ప్రిన్సిపాల్  వెంకటేశ్  తెలిపిన వివరాల ప్రకారం. చిన్నచింతకుంట మండలానికి చెందని బీసీ వెల్ఫేర్  బాలుర పాఠశాలను దేవరకద్రలో నిర్వహిస్తున్నారు. 9వ తరగతికి చెందిన నలుగురు స్టూడెంట్లు టీమ్​ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే క్లాస్ కు చెందిన కొందరు స్టూడెంట్లు రోజూ బయటకు వెళ్లి వస్తున్నారని టీచర్లకు కంప్లైంట్​ చేసింది వారేనని అనుమానించారు.

 ఆ నలుగురు ఉంటున్న గదిలోకి ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో 15 మంది స్టూడెంట్లు వెళ్లారు. లైట్లు బంద్​ చేసి నలుగురు విద్యార్థులపై దాడి చేశారు. దీంతో వారి వీపులు, ముఖాలపై గాయాలయ్యాయి. దాడి చేసిన విషయాన్ని బయటకు చెబితే మళ్లీ దాడి చేస్తామని చెప్పడంతో, ఆ నలుగురు స్టూడెంట్లు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 

అక్కడ పని చేస్తున్న వంట మనిషికి తెలియడంతో సోమవారం రాత్రి ప్రిన్సిపాల్​ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. దేవరకద్ర ఎస్సై నాగన్న గురుకులానికి చేరుకొని విచారణ చేశారు. దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సెలింగ్​ ఇచ్చారు. ఘటన గురించి ప్రిన్సిపాల్​ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు దాడి చేసిన15 మంది స్టూడెంట్లకు టీసీ ఇచ్చి పంపించారు.