ఐటీ దాడులతో మీడియాను భయపెట్టలేరు

ఐటీ దాడులతో మీడియాను భయపెట్టలేరు

న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ పై జరిగిన ఐటీ దాడులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఇలాంటి దాడులతో మీడియాను భయపెట్టలేరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 'దైనిక్ భాస్కర్ తోపాటు భారత్ సమాచార్ మీద ఇన్ కమ్ టాక్స్ శాఖ చేసిన దాడులు మీడియాను భయపెట్టడానికి చేసినవిగా కనిపిస్తున్నాయి. వాళ్ల సందేశం స్పష్టంగా అర్థమవుతోంది.. ఎవరైతే బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడతారో వారిని అస్సలు వదిలి పెట్టరు. కానీ ఇలాంటి ఆలోచనలు సరికావు. ఇది చాలా ప్రమాదకరం. దీనికి వ్యతిరేకంగా అందరూ గొంతెత్తాలి' అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
కేంద్రం వెంటనే దాడులను ఆపి.. మీడియాను స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేసుకోనివ్వాలని కేజ్రీవాల్ కోరారు. కాగా, మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్ లోని దైనిక్ భాస్కర్ ఆఫీసుల్లో గురువారం ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన హిందీ న్యూస్ ఛానల్ భారత్ సమాచార్ కార్యాలయంలోనూ ఇవ్వాళ ఐటీ దాడులు జరిగాయి.