హైదరాబాద్, వెలుగు: పూర్తి స్థాయి బ్యాంక్‌గా మారేందుకు సిద్ధమవుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్‌ఎఫ్‌బీ), ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో అదరగొట్టింది. రూ.796 కోట్ల నికర లాభం సంపాదించింది. ఇది కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.581 కోట్లతో పోలిస్తే 37 శాతం ఎక్కువ. బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ (ఎన్‌ఐఎం) రూ.2,045 కోట్ల నుంచి 32 శాతం వృద్ధి చెంది రూ.2,695 కోట్లకు చేరింది. గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏల) రేషియో 2.10 శాతానికి, నెట్ ఎన్‌పీఏల రేషియో 0.76 శాతానికి మెరుగుపడ్డాయి.
‘ఏయూ బ్యాంక్’ గా మారే పనులు జరుగుతున్నాయి. అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా కొనసాగుతున్న ఏయూ ఎస్‌ఎఫ్‌బీ , యూనివర్సల్ బ్యాంక్ ప్రాథమిక అనుమతులను ఆర్‌బీఐ నుంచి కిందటేడాది ఆగస్టులో పొందింది. రెగ్యులేటరీ రూల్స్, ఆడిట్‌లు పూర్తి చేయాల్సి ఉంది. అలానే సాంకేతిక, నిర్వహణ పరమైన మార్పులను చేపట్టిన తర్వాతనే ఫైనల్ లైసెన్స్ దక్కుతుంది. బ్యాంక్ ఏఐపై ఖర్చులు పెంచింది. ఏజెంటిక్ ఏఐతో సపోర్ట్‌తో పనిచేసే గోల్డ్ లోన్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది.
మేనేజ్‌మెంట్‌లో మార్పు
ఏయూ ఎస్‌ఎఫ్‌బీ యోగేష్ జైన్‌ను డిప్యూటీ సీఈఓగా నియమించింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన యోగేష్‌కు ఆర్థిక రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన గత 16 ఏళ్ల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నారు. సంస్థ ఎన్‌బీఎఫ్‌సీ స్థాయి నుంచి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత సీఈఓ సంజయ్ అగర్వాల్‌తో కలిసి యోగేష్ పనిచేస్తారు.
