AUS vs WI: రస్సెల్ మెరుపులు.. ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం

AUS vs WI: రస్సెల్ మెరుపులు.. ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం

వరుస ఓటములతో తల్లడిల్లుతోన్న విండీస్ వీరులకు ఊరట లభించింది. ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ముగించారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక జట్టు ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించింది. మంగళవారం(ఫిబ్రవరి 13) పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన చివరి టీ20లో విండీస్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. 

ఆదుకున్న రస్సెస్, రూథర్ ఫోర్డ్

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ జట్టును ఆండ్రీ రస్సెల్(29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), షేర్పాన్ రూథర్‌ఫోర్డ్‌ (40 బంతుల్లో 67*; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆదుకున్నారు. ఈ జోడీ ఆసీస్ బౌలర్లపై అది నుంచే ఎదురుదాడికి దిగారు. భారీ సిక్సర్లతో హోరెత్తించారు. ముఖ్యంగా విండీస్ విధ్వంసకర బ్యాటర్ రస్సెల్.. ఆసీస్ స్పిన్నర్ జంపాను టార్గెట్ చేసి మరీ చితక్కొట్టాడు.

వార్నర్ ఒంటరి పోరాటం

అనంతరం 226 పరుగుల భారీ ఛేదనలో ఆసీస్ 183 పరుగులకే పరిమితమైంది. వార్నర్ 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరిలో టిమ్ డేవిడ్ (41; 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయాడు. మిచ్‌ మార్ష్‌ (17), జోష్ ఇంగ్లీష్(1), మ్యాక్స్‌వెల్‌ (12), ఆరోన్‌ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ విజయంతో విండీస్ జట్టు వైట్ వాష్(2-0) నుంచి తప్పించుకుంది. 

అంతకుముందు ఈ ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్‌ సిరీస్‌ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది.