ఆసీస్​.. ఎనిమిదోసారి .. వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్లో కంగారూలు

ఆసీస్​.. ఎనిమిదోసారి .. వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్లో కంగారూలు
  • సెమీస్‌‌లో 3 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలుపు
  • రాణించిన హెడ్‌‌, స్మిత్‌‌, కమిన్స్‌‌, స్టార్క్‌‌
  • డేవిడ్‌‌ మిల్లర్‌‌ సెంచరీ వృథా
  • ఆదివారం ఇండియాతో టైటిల్​ ఫైట్​


కోల్‌‌కతా: టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కంగారుపడినా.. ఆస్ట్రేలియా ఎట్టకేలకు వరల్డ్‌‌ కప్‌‌ ఫైనల్‌‌కు చేరింది. లక్ష్య ఛేదనలో ట్రావిస్‌‌ హెడ్‌‌ (48 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 62), స్టీవ్‌‌ స్మిత్‌‌ (30) మెరవడంతో.. గురువారం జరిగిన రెండో సెమీస్‌‌లో ఆసీస్‌‌ 3 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై కష్టపడి గెలిచింది. ఫలితంగా ఎనిమిదోసారి మెగా ఈవెంట్‌‌ టైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించింది. టాస్‌‌ గెలిచిన సౌతాఫ్రికా 49.4 ఓవర్లలో 212 రన్స్‌‌కు ఆలౌటైంది. డేవిడ్‌‌ మిల్లర్‌‌ (116 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101), హెన్రిచ్‌‌ క్లాసెన్‌‌ (48 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47) చెలరేగారు. తర్వాత ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 215/7 స్కోరు చేసింది. హెడ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆసీస్‌‌.. ఇండియాతో తలపడనుంది. 

బౌలింగ్‌‌ అదుర్స్‌‌..

చిన్న టార్గెట్‌‌ను కాపాడుకునేందుకు సఫారీ బౌలర్లు చివరి వరకు శ్రమించారు. ఓపెనర్లు ట్రావిస్‌‌ హెడ్‌‌, వార్నర్‌‌ (29) తొలి వికెట్‌‌కు 60 రన్స్‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. అయినా 16 బాల్స్‌‌ తేడాలో వార్నర్‌‌, మిచెల్‌‌ మార్ష్‌‌ (0)ను ఔట్‌‌ చేసి సఫారీలు జోష్‌‌ పెంచారు. హెడ్‌‌తో కలిసి స్మిత్‌‌ (30) నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. బౌండ్రీల జోలికి పోకుండా కేవలం సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో మూడో వికెట్‌‌కు 45 రన్స్‌‌ జత చేశాడు. కానీ 15వ ఓవర్‌‌లో కేశవ్‌‌ మహారాజ్‌‌ (1/24).. హెడ్‌‌ను ఔట్‌‌ చేసి పెద్ద బ్రేక్‌‌ ఇచ్చాడు. అప్పటికి కంగారూల స్కోరు 106/3. గెలవడానికి మరో 107 రన్స్‌‌ కావాల్సిన దశలో ప్రొటీస్‌‌ బౌలర్లు మరింత చెలరేగారు. 

లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో బిగ్‌‌ హిట్టర్లు లబుషేన్‌‌ (18), మ్యాక్స్‌‌వెల్‌‌ (1), స్మిత్‌‌, ఇంగ్లిస్‌‌ (28)పై తీవ్ర ఒత్తిడి పెంచారు. బౌండ్రీలు, సిక్సర్లను అడ్డుకున్నారు. దీన్ని గమనించిన స్మిత్‌‌ మెల్లగా స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ ఇంగ్లిస్‌‌తో కలిసి ఏడో వికెట్‌‌ 37 రన్స్‌‌ జోడించాడు. కానీ ఆరు ఓవర్ల వ్యవధిలో ఈ ఇద్దర్ని ఔట్‌‌ చేయడంతో ఆసీస్‌‌ 40 ఓవర్లలో 193/7తో నిలిచింది. గెలవాలంటే 20 రన్స్‌‌ కావాల్సిన టైమ్‌‌లో ప్రొటీస్‌‌ బౌలర్లు అసలు సిసలు పోరాటం చేశారు. క్రీజులో ఉన్న స్టార్క్‌‌ (16 నాటౌట్‌‌), కమిన్స్‌‌ (14 నాటౌట్‌‌)ను మార్‌‌క్రమ్‌‌ (1/23), కోయెట్జీ (2/47) పూర్తిగా కంట్రోలు చేశారు. డిఫెన్స్‌‌కే పరిమితం చేసి సింగిల్స్‌‌ను కూడా నిరోధించారు. దాదాపు 7.2 ఓవర్ల పాటు ఈ ఇద్దర్ని ఉక్కిరి బిక్కిరి చేయడంతో కంగారూల శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే వీలైనప్పుడల్లా సింగిల్స్‌‌ తీసిన కమిన్స్‌‌.. చివరకు జెన్‌‌సెన్‌‌ బౌలింగ్‌‌లో విన్నింగ్‌‌ ఫోర్‌‌ కొట్టడంతో ఆసీస్‌‌ ఫైనల్‌‌కు చేరింది. షంసి 2 వికెట్లు తీశాడు. 

ఆదుకున్న మిల్లర్‌‌, క్లాసెన్‌‌

గత మ్యాచ్‌‌ల్లో ఛేజింగ్‌‌లో ఇబ్బందిపడ్డ సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌‌ ఎంచుకుంది. కానీ టర్నింగ్‌‌ ట్రాక్‌‌పై ఆసీస్‌‌ పేసర్లు నిప్పులు కురిపించారు. కొత్త బాల్‌‌ జోడీ మిచెల్‌‌ స్టార్క్‌‌ (3/34), హాజిల్‌‌వుడ్‌‌ (2/12) కండిషన్స్‌‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. స్పీడ్‌‌, స్వింగ్‌‌, ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో వణికించారు. ఫలితంగా ఆరు ఓవర్లలోనే ఓపెనర్లు బవూమ (0), డికాక్‌‌ (3)ను ఔట్‌‌ చేశారు. దీనికి తోడు వార్నర్‌‌, లబుషేన్‌‌ సూపర్‌‌ ఫీల్డింగ్‌‌తో 15, 20 రన్స్‌‌ కాపాడారు. దీంతో పవర్‌‌ ప్లేలో సఫారీలు కేవలం 17/2 స్కోరే చేశారు. డసెన్‌‌ (6), మార్‌‌క్రమ్‌‌ (10) అటాకింగ్‌‌ గేమ్‌‌ ఆడే ప్రయత్నం చేసినా స్టార్క్‌‌, హాజిల్‌‌వుడ్‌‌ ముందు నిలవలేకపోయారు. 

ఫలితంగా ప్రొటీస్‌‌ 12 ఓవర్లలో 24/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్‌‌, మిల్లర్‌‌ అద్భుతంగా పోరాడారు. వర్షం వల్ల 40 నిమిషాల పాటు మ్యాచ్‌‌ ఆగడంతో కాస్త రిలాక్స్‌‌ అయిన ఈ జోడీ తర్వాత విజృంభించింది. ముఖ్యంగా హాజిల్‌‌వుడ్‌‌ను టార్గెట్‌‌ చేసి మిల్లర్‌‌ కళ్లు చెదిరే ఫోర్లు, సిక్స్‌‌లు బాదాడు. అయితే స్పిన్నర్‌‌ జంపా బౌలింగ్‌‌ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బందిపడినా 7 ఓవర్లలో 55 రన్స్‌‌ రాబట్టారు. రెండో ఎండ్‌‌లో క్లాసెన్‌‌ కూడా బ్యాట్‌‌ ఝుళిపించాడు. 

సింగిల్స్‌‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు కొట్టి రన్‌‌రేట్‌‌ పెంచాడు. ఈ క్రమంలో ఐదో వికెట్‌‌కు 95 రన్స్‌‌ జోడించిన క్లాసెన్‌‌తో పాటు మార్కో జెన్‌‌సెన్‌‌ (0)ను హెడ్‌‌ (2/21) వరుస బాల్స్‌‌లో ఔట్‌‌ చేశాడు. కోయెట్జీ (19)తో కలిసి మిల్లర్‌‌ ఏడో వికెట్‌‌కు 53 రన్స్‌‌ జోడించడంతో సఫారీ ఇన్నింగ్స్‌‌ గాడిలో పడింది. కమిన్స్‌‌ (3/51) బౌలింగ్‌‌లో స్క్వేర్‌‌ లెగ్‌‌లో 94 మీటర్ల దూరం బాల్‌‌ను పంపి సెంచరీ పూర్తి చేసిన మిల్లర్‌‌కు రెండో ఎండ్‌‌లో సహకారం అందలేదు. స్వల్ప వ్యవధిలో కేశవ్‌‌ మహారాజ్‌‌ (4), రబాడ (10) ఔట్​  కావడంతో సౌతాఫ్రికా పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది.