రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మృతి

ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  క్విన్స్ లాండ్ లోని టౌన్స్ విల్లేలో  శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ చనిపోయాడు.   క్వీన్స్ లాండ్ లో శనివారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. తీవ్ర గాయాలైన అతడిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో సైమండ్స్ చికత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.  ప్రమాద సమయంలో సైమండ్స్ మాత్రమే కారులో ఉన్నట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కారు బోల్తాపడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

సైమండ్స్ మృతితో క్రీడా ప్రపంచం  తీవ్ర దిగ్భ్రాంతికి  గురైంది. ఆస్ట్రేలియా క్రికెట్ అతడికి సంతాపం వ్యక్తం చేసింది. పలువురు క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సైమండ్స్ 1998 నుంచి 2009 వరకు మొత్తం 26 టెస్టులు, 198 వన్డేలు,14 టీ20లు,39 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. ఆస్ట్రేలియా 2003, 2007 వన్డే ప్రపంచ కప్ జట్టులో సభ్యునిగా ఉన్నాడు. వన్డేల్లో 5088 పరుగులు,13 వికెట్లు, టెస్టుల్లో 1462 పరుగులు, టీ20ల్లో 337 పరుగులు చేశాడు.