సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో ఇండియా జోడీ 25–-23, 21–-16 తో చైనీస్ తైపీకి చెందిన చాంగ్ కో-చి– పో లి-వియ్‌పై గెలిచింది.
48 నిమిషాల పాటు జరిగిన ఈ పోరాటంలో తొలి గేమ్‌లో మొదట వెనుకంజ వేసిన సాత్విక్–చిరాగ్ 19-–17తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చారు. చివర్లో తీవ్ర ఉత్కంఠ మధ్య గేమ్ గెలిచారు.
రెండో గేమ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చూపెట్టారు. రెండు అద్భుతమైన స్మాష్‌లతో మ్యాచ్‌ను ముగించారు. అయితే, విమెన్స్ డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ10–-21, 14–-21తో కుసుమ–పుష్పితాసరి (ఇండోనేసియా) చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.
