మగవాళ్లలో పెరుగుతున్న సంతానలేమి సమస్య

మగవాళ్లలో పెరుగుతున్న సంతానలేమి సమస్య
  •    మగవాళ్లలో పెరుగుతున్న సంతానలేమి సమస్య
  •     ఆస్ట్రేలియన్ సైంటిస్టుల హెచ్చరిక 
  •     లైఫ్ స్టైల్, పర్యావరణ మార్పులే ప్రధాన కారణం 
  •     కేన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులకూ సంకేతం  
  •     వెంటనే చర్యలు తీసుకోవాలె

మెల్ బోర్న్:  ప్రపంచవ్యాప్తంగా మగవాళ్లలో ఇన్ ఫర్టిలిటీ (వంధ్యత్వం) సమస్య పెరుగుతోందని ఆస్ట్రేలియా సైంటిస్టులు హెచ్చరించారు. గత కొన్ని దశాబ్దాల్లో పర్యావరణ, జీవనశైలి సంబంధమైన మార్పుల కారణంగా పురుషుల్లో ఈ సమస్య క్రమంగా అధికం అవుతోందని వారు వెల్లడించారు. పురుషుల్లో వంధ్యత్వం, నివారణ అంశాలపై అధ్యయనం చేసిన ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్ బోర్న్ ప్రొఫెసర్ మోయిరా ఓబ్రియాన్, హడ్సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​మెడికల్ రీసెర్చ్ ప్రొఫెసర్ రాబర్ట్ మెక్ లాక్లాన్ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేశారు.

 ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరు జంటల్లో ఒక జంట ఇప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని వారు తెలిపారు. అయితే, పురుషుల్లో వంధ్యత్వం పెరగడానికి ప్రధానంగా శరీరంలో జరిగే మార్పులు, జన్యుమార్పులు, పర్యావరణం, జీవనశైలి, సామాజిక ఒత్తిళ్లే కారణమని తమ అధ్యయనంలో తేలినట్లు వారు వెల్లడించారు. పురుషుల్లో వంధ్యత్వం సమస్యకు కారణాన్ని గుర్తించడం అంత ఈజీ కాదని, అలాగే దీని కారణంగా సంతాన సాఫల్య చికిత్సల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. 

ఫలితంగా అనేక కుటుంబాలు ఇటు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. పురుషుల్లో ఇన్ ఫర్టిలిటీ సమస్యను కేన్సర్ తోపాటు డయాబెటిస్ వంటి మెటబాలిక్ డిజార్డర్స్ కు ఒక సంకేతంలా కూడా చూడొచ్చని సైంటిస్టులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వాలు, సంస్థలు  ఏం చేయాలన్నదానిపై వారు పలు సిఫారసులు చేశారు. 

సైంటిస్టుల రెకమండేషన్స్ ఇవే..


 పురుషుల్లో ఇన్ ఫర్టిలిటీ సమస్య గుర్తింపు, చికిత్స  సరైన స్థాయిలో అందుబాటులో లేవు. వీటిపై పరిశోధనలూ తక్కువగా జరుగుతున్నాయి. అందుకే మేల్ ఇన్ ఫర్టిలిటీపై పరిశోధనలు పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది.  పురుషులు, వారి జీవిత భాగస్వాములు, సంతానికి సంబంధించిన టిష్యూస్, క్లినికల్ డేటాను పొందుపరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో బయోబ్యాంక్ ను ఏర్పాటు చేయాలి. ఇది వంధ్యత్వానికి దారితీసే జన్యు, పర్యావరణపరమైన కారణాలపై స్టడీకి ఉపయోగపడుతుంది.   
  వంధ్యత్వానికి జన్యుపరమైన కారణాలు, నిర్ధారణ, నివారణ పద్ధతులను తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జన్యుపరమైన రీసెర్చ్ లు కొనసాగించాలి. 

  రోజూ వినియోగించే ఉత్పత్తుల్లో ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీసే కెమికల్స్ మగవారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకునేందుకు టెస్టులు చేయాలి. 
  పురుషుల పని ప్రదేశం, వాతావరణ అంశాలూ కారణమా? అన్న కోణంలోనూ పరిశోధనలు చేయాలి.  ఆయా ఉత్పత్తుల్లో హానికరమైన కెమికల్స్ నుంచి పురుషులు, మగపిల్లలను రక్షించడానికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. హానికర కెమికల్స్ తో కూడిన పదార్థాలకు ప్రత్యామ్నాయాలను గుర్తించాలి. పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకునేలా పురుషులను ప్రోత్సహించాలి. ఇందులో హెల్త్ స్టాఫ్ కు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.