భారత్ నుంచి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష

భారత్ నుంచి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష
  • భారత్‌లోని తమ దేశ పౌరులను తిరిగి రావొద్దన్న ఆస్ట్రేలియా
  • నిబంధన ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు, భారీ జరిమానా
  • మే 15 వరకు ఈ నిబంధన అమలు

ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులను దేశంలోకి రాకుండా ఆస్ట్రేలియా తాత్కాలికంగా నిషేధించింది. ఇండియాలో 14 రోజుల పాటు ఉండి.. రిటర్న్ అవ్వాలనుకునే వాళ్లను ఇప్పట్లో ఆస్ట్రేలియాకు రావొద్దని సూచించింది. ఒక వేళ ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 66 వేల డాలర్ల జరిమానా కూడా విధిస్తామని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆంక్షలు మే 3 సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియాలో కరోనా కేసులు మరియు మరణాల పెరుగుదలతో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 

‘ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోదు. ఆస్ట్రేలియన్ ప్రజల ఆరోగ్యం మరియు వ్యవస్థల యొక్క సమగ్రత రక్షించబడటం చాలా క్లిష్టమైనది. కఠిన నిర్ణయాల వల్లే కరోనా కేసుల సంఖ్యను తగ్గించగలిగాం. కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు భారత్ నుంచి వచ్చే మా దేశ పౌరులను కూడా రావొద్దన్నాం. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తాం. మే 15న ఈ ఆంక్షలపై మరోసారి ప్రభుత్వం పున:పరిశీలిస్తుంది’ అని గ్రెగ్ హంట్ తెలిపారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతీయ-ఆస్ట్రేలియన్లు జాత్యహంకార విధానంగా చూస్తున్నారు. ఎందుకంటే అమెరికా, యూకే,  మరియు యూరప్ వంటి దేశాలు ఇటువంటి నిబంధనను పెట్టలేదు. అందుకే భారత-ఆస్ట్రేలియన్లు ఇలా భావిస్తున్నారు. ఆస్ట్రేలియన్ మానవ హక్కుల సంఘాలు కూడా ఈ నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తిరిగి వచ్చే వాళ్లపై శిక్ష కాకుండా.. నిర్బంధ వ్యవస్థను అమలుచేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించాయి.

ఇప్పటివరకు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్లు లేని ఆస్ట్రేలియా.. ఏప్రిల్ 27 మంగళవారం నుంచి మే 15 వరకు భారత్ నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దాంతో క్రికెటర్లు ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్‌సన్‌లతో సహా కొంతమంది ఆస్ట్రేలియన్లు దోహా ద్వారా ఆస్ట్రేలియాకు చేరుకున్నారు.

శుక్రవారం రాత్రి ఆలస్యంగా జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఇండియాలోని ఆస్ట్రేలియా పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడం నిషిద్ధం. ఈ చర్య వల్ల భారతదేశంలో 9,000 మంది ఆస్ట్రేలియన్లు చిక్కుకుపోయారు. వారిలో 650 మంది పరిస్థితి దారుణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.