వ్యాక్సిన్​ వేసుకోనోళ్లు ఇంట్లనే ఉండాలె.. బయటకు వస్తే ఫైన్

వ్యాక్సిన్​ వేసుకోనోళ్లు ఇంట్లనే ఉండాలె.. బయటకు వస్తే ఫైన్

కరోనా వ్యాక్సిన్​ వేసుకోకుంటే ఇంట్లకెళ్లి బయటకు రావొద్దని ఆస్ట్రియా ప్రభుత్వం ఆర్డర్​ వేసింది. ఇలాంటి వారిపై దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తున్నట్లు తెలిపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 24 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. దీనిని కూడా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలను హెచ్చరించింది. వ్యాక్సిన్​ వేసుకోకున్నా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని గుర్తించి పోలీసులు వారికి 1,450 యూరోల(మన రూపాయల్లో 1.24 లక్షలు) ఫైన్​ వేస్తారని వివరించింది. దేశంలో ఓవైపు కేసులు పెరుగుతుండడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తొంభై లక్షలకు పైగా జనాభా ఉన్న ఆస్ట్రియాలో 65% మంది కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. మిగతా వారినీ వ్యాక్సిన్​ వేసుకునేలా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

తాజా ఆదేశాల ప్రకా రం.. 12 ఏండ్లు పైబడిన వాళ్లు ఇప్పటికీ వ్యాక్సిన్​ వేసుకోకుంటే ఇళ్లు వదిలి బయటకు రావొద్దు. ఆఫీసులకు వెళ్లడానికి, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు, వాకింగ్​కు, వ్యాక్సిన్​ వేయించుకోవడానికి బయటకు వెళ్లొచ్చని మినహాయింపు ఇచ్చింది. దేశంలో 12 ఏండ్లలోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్​ వేయట్లేదు కాబట్టి పిల్లలకు ఈ రూల్​నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష నేత హెర్బర్ట్​ కికిల్​మండిపడ్డారు. దాదాపు 20 లక్షల మంది ప్రజలు(వ్యాక్సిన్​ వేసుకోనోళ్లు) ఏ తప్పూ చేయకున్నా హౌస్​ అరెస్ట్​లో ఉండాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం  చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై లీగల్​గా, పార్లమెంట్​లో పోరాడుతామని స్పష్టం చేశారు.