
- ఇఫ్లూలో విద్యార్థిని లైంగికదాడి ఘటనపై దిగొచ్చిన అధికారులు
- కొత్త ప్రొక్టార్‌గా శ్రీవాణి నియమిస్తూ ఉత్తర్వులు జారీ
- నిందితులను గుర్తించేదాకా ఆందోళన చేస్తామన్న స్టూడెంట్స్
ఓయూ,వెలుగు : కొద్ది రోజులుగా ఇఫ్లూలో స్టూడెంట్లు చేస్తున్న ఆందోళనకు అధికారులు దిగొచ్చారు. వర్సిటీ ప్రొక్టార్ను మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు. మరో ప్రొఫెసర్‌ను నియమించారు. గత నెల 18న ఇఫ్లూలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందని స్టూడెంట్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, వర్సిటీలో స్టూడెంట్లకు రక్షణ కల్పించని అధికారులను తొలగించాలంటూ ఆందోళనలు చేపట్టారు. అప్పట్లో దీనిపై వర్సిటీ నిర్ధారణ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక అందజేయలేదని, బాధ్యులను ఇప్పటి వరకు గుర్తించలేదని పేర్కొంటూ స్టూడెంట్లు మూడ్రోజులుగా మళ్లీ ఆందోళనకు దిగారు.
ఇఫ్లూ ప్రొక్టార్ను తొలగించాలనే డిమాండ్‌తో స్టూడెంట్లు నిరవధిక సమ్మె కొనసాగిస్తుండగా.. వర్సిటీలో ప్రశాంత వాతావరణానికి ఆటంకం కలుగుతుందని అధికారులు చర్చలు జరిపారు. స్టూడెంట్ల డిమాండ్ మేరకు ఇఫ్లూ ప్రొక్టార్ శ్యాంసన్‌ను తొలగిస్తూ, నూతన ప్రొక్టార్‌గా ప్రొఫెసర్ శ్రీవాణిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రొక్టార్ను పదవి నుంచి తొలగించినా స్టూడెంట్లు ఆందోళన విరమించలేదు. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షించే వరకు ఆందోళన విరమించబోమని స్టూడెంట్లు స్పష్టం చేశారు.