ఎంతటి ఉద్యమానికైనా పూనుకుంటాం.. పోలవరం, బానకచర్ల సంగతి తేలుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

ఎంతటి ఉద్యమానికైనా పూనుకుంటాం.. పోలవరం, బానకచర్ల సంగతి తేలుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

శనివారం ( ఆగస్టు 2 ) నగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విలాసవంతమైన జీవితం కోసం అధికారంలోకి రాలేదని.. ప్రజాసమస్యలు తీర్చడమే తమ ఎజెండా అని అన్నారు. తెలంగాణవాదం పేరు చెప్పి నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని అన్నారు.సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఢిల్లీ వెళ్లారు కాబట్టి బనకచర్ల ఆగిందని... బీఆర్ఎస్, టిడిపి కూడబలికి తెలంగాణ ప్రజలపై కుట్ర పన్నుతున్నారని అన్నారు.

గోదావరి కృష్ణ నదులపై గత కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే తప్ప కొత్త ప్రాజెక్టులు కట్టలేదని... అలా కట్టి ఉంటే జలవివాదాలు వచ్చి ఉండేవి కావని... బనకచర్ల తెరపైకి వచ్చేదే కాదని అన్నారు భట్టి. ఆ దిశగా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులకు రీ డిజైన్,  దోపిడీ ఆలోచన తప్ప నీళ్లు పారించే ఆలోచన చేయలేదని అన్నారు. పదేళ్లలో చేపట్టిన ఏకైక ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేయలేదని... పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సర్కార్ కృషి చేస్తోందని అన్నారు.

గోదావరి నదిపై బీఆర్ఎస్ హయాం లో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కుంగి, కూలిపోయిందని... వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని వాడుకునేందుకు బనకచర్ల కడుతున్నామని ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించే పనులు చేస్తోందని అన్నారు.తెలంగాణ వాదం పేరుతో గద్దెనెక్కి నీళ్లు రానీయలేదని.. నిధులు దోపిడీ చేసి ప్రజాస్వామ్యాన్ని బిఆర్ఎస్ కూని చేసిందని మండిపడ్డారు భట్టి. మా నీళ్ళు మాకు దక్కేవరకు మా ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు బనకచర్ల జరగనియ్యమని అన్నారు. 

ఎంతటి ఉద్యమానికైనా పూనుకుంటామని..  పోలవరం, బనకచర్ల సంగతి తేలుస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలను కాపాడుకుంటామని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో రెండు లక్షల జనం మునిగిపోకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టాలని... లేదంటే పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు భట్టి.