పాలమూరు జిల్లాలో దౌర్జన్యంగా భూసేకరణ యత్నం

పాలమూరు జిల్లాలో దౌర్జన్యంగా భూసేకరణ యత్నం

మహబూబ్​నగర్/జడ్చర్ల, వెలుగు: ఉన్నతాధికారుల ఒత్తిళ్లో.. లేదా హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేనితనమో తెలియదు గాని పాలమూరు జిల్లాలో అధికారులు రెచ్చిపోయారు. నిర్వాసిత రైతుల పొలాలపై పడి విధ్వంసం సృష్టించారు. హైకోర్టు, ఎన్జీటీ ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా, కనీసం రైతులకు నోటీసులైనా ఇవ్వకుండా జేసీబీలతో పొలాలను, పంటలను, చెట్లను మట్టిపాలు చేశారు. ఆగ్రహించిన రైతులంతా ఏకమై ఎదురుతిరిగి నిర్బంధించడంతో వాహనాలు వదిలి పోలీసుల భద్రత మధ్య వెళ్లిపోవాల్సి వచ్చింది.  

రిజర్వాయర్​ కోసమని..

పాలమూరు–- రంగారెడ్డి స్కీంలో భాగంగా ప్రభుత్వం మహబూబ్​నగర్ ​జిల్లా జడ్చర్ల మండలంలో 15.91టీఎంసీల సామర్థ్యంతో ఉదండాపూర్​ రిజర్వాయర్​ నిర్మిస్తోంది. దీని కోసం ఉదండాపూర్, వల్లూరు, పోలేపల్లి, కిష్టారం, తీగలపల్లి, ఖానాపూర్​, కారూర్, సిద్దోటం గ్రామాల పరిధిలో 5,107 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. పోలేపల్లి రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.12.50 లక్షల పరిహారం ఇచ్చిన సర్కారు.. వల్లూరు, ఉదండాపూర్, తీగలపల్లి రైతులకు123 జీవో ప్రకారం కొందరికి ఎకరాకు రూ.5.50 లక్షలు, మరికొందరికి రూ.3.50 లక్షల చెల్లించింది. దాన్ని ఆ మూడు గ్రామాలకు చెందిన 34 మంది రైతులు వ్యతిరేకించారు. తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని 2017లో కోర్టును ఆశ్రయించారు. 2019 డిసెంబరు 4న కోర్టు స్టే ఆర్డర్​ఇచ్చింది. అప్పటి నుంచి భూ సేకరణ ఆగిపోయింది. ఈ భూమి రిజర్వాయర్​కట్ట చివరి భాగంలో ఉండటంతో, పనులకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో బలవంతంగా ఆ భూములను రైతుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ ఆఫీసర్లు 2019 నుంచి ప్రయత్నం చేస్తున్నారు. 

తెల్లారకముందే ...

శుక్రవారం తెల్లవారుజామున ఐదున్నరకు 16 బృందాలుగా ఏర్పడిన రెవెన్యూ అధికారులు.. పోలీసు బందోబస్తుతో తీగలపల్లి, ఉదండాపూర్​లలోని రైతుల భూముల్లోకి చొరబడ్డారు. జేసీబీలతో మామిడి, టేకు, మిర్చి తోటలను పీకేశారు. నవాబ్​పేట తహసీల్దార్​ రాజేందర్​రెడ్డి, ఇరిగేషన్​డీఈ సురేశ్, తీగలపల్లి సర్పంచ్​ చెన్నయ్య​ తీగలపల్లిలో సాయిరెడ్డికి చెందిన తోటలో 28 మామిడి, టేకు చెట్లను తొలగించారు. తర్వాత కెనాల్​కోసం పునాది తీశారు. తోటలకు కాపలాగా ఉన్నవారు ఊర్లోకి వెళ్లి గ్రామస్తులను తీసుకువచ్చేందుకు పరిగెత్తగా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

పురుగుల మందు తాగబోయిన..

భూ సేకరణ స్పెషల్​ఆఫీసర్​పద్మశ్రీ ఆధ్వర్యంలో మరో టీమ్​ ఉదండాపూర్​కు చెందిన కర్రె బాలయ్యకు చెందిన ఎకరా మిర్చి తోటలోకి ఉదయం ఆరున్నరకు ప్రవేశించారు. పాలు పితకడానికి వెళ్లిన బాలయ్య చిన్న కొడుకు రామచంద్రయ్య చూసి వారిని అడ్డుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని గుంజుకుపోయారు. కండ్ల ముందే పంటను నాశనం చేస్తుండటంతో పొలాల్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉదండాపూర్​గ్రామస్థులు తోట వద్దకు చేరుకొని స్పెషల్​ఆఫీసర్​తో వాదనకు దిగారు. దీంతో ఆమె పోలీసుల బందోబస్తు మధ్య వెళ్లిపోయారు. 

ఆర్డీవో, తహసీల్దార్ల నిర్బంధం

ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయంటూ పాలమూరు ఆర్డీఓ అనిల్, జడ్చర్ల తహసీల్దార్​లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ ​డీఈ సురేశ్, ఈఈ ఉదయ్​శంకర్, ప్రాజెక్టు మేనేజర్​రమేశ్​తదితరులు ఇంజినీరింగ్​ఆఫీసర్లకు భూమి అప్పగించేందుకు ఉదయం ఏడున్నరకు ఉదండాపూర్​ రిజర్వాయర్​ కట్ట వద్దకు చేరుకున్నారు. కోర్టు స్టే ఆర్డర్​ఉన్నా పనులు ఎట్లా చేస్తున్నారని, దౌర్జన్యంగా భూములు ఎందుకు లాక్కుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కోర్టు స్టే ఇచ్చిన కాపీలను ఆర్డీవో అనిల్​కు చూపించారు.  ఇంజినీర్లకు భూమిని అప్పగించేందుకు వచ్చామని, కోర్టు విషయం తనకు తెలియదని అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా రైతులు ఆఫీసర్లను వాహనాల్లోనే నిర్బంధించారు.

ఎకరా తోట నాశనం.. 

మాకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని 2016 కోర్టులో కేసు వేసినం. ఇంకా ఆ కేసు పరిష్కారం కాలె. కానీ, భూ సేకరణ కోసం స్పెషల్ ఆఫీసర్​పద్మశ్రీ ఉదయం మా భూమిలోకి వచ్చారు. మా తమ్ముడు కోర్టు ఆర్డర్​ఉంది, తెస్తామని చెప్పినా వినకుండా ఎకరా మిర్చి తోటను నాశనం చేసిన్రు. దీంతో అతను పురుగుల మందు తాగబోయిండు. పోలీసులు చూసి లాక్కున్నారు. అప్పటికే కొంత మందు నోట్లోకి పోయింది. పెరుగు పోసి బయటకు తీసినం. 
- శంకరయ్య, రాంచంద్రయ్య అన్న, ఉదండాపూర్​

స్పెషల్​ ఆఫీసర్​కే తెలుసు

నేను కొత్తగా వచ్చిన. వారం రోజులే అవుతోంది. భూమిపై కోర్టులో స్టే ఉన్న విషయం తెలిదు. జిల్లా అధికారులు ఉదయం ఫోన్​ చేశారు. ఇరిగేషన్ ​అధికారులకు ల్యాండ్​అప్పజెప్పాలని చెప్పారు. అందుకే వచ్చిన. అన్ని విషయాలు భూ సేకరణ స్పెషల్ ​ఆఫీసర్​కే తెలుసు.
- అనిల్, ఆర్డీవో, పాలమూరు