ఎల్లారెడ్డిపేట, వెలుగు: అప్పు ఎక్కువైంది.. దుబాయ్ వెళ్లి బాకీ తీర్చుకో బిడ్డ అన్నందుకు మనస్థాపానికి గురైన కొడుకు ఫ్రెండ్స్ కు వీడియో కాల్ చేసి లైవ్‌లో ఉరేసుకొని చనిపోయాడు. ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పొన్నాల రవీందర్ రెడ్డికి ఇద్దరు కొడుకులు.
పెద్ద కొడుకు సంజీవ్ రెడ్డి(31) దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చి ఆరు నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు. పొలంలో ఆరు బోర్లు వేయడంతో అప్పులు ఎక్కువయ్యాయి. అప్పు ఇచ్చిన వారు అడగుతుండడంతో తండ్రి తన పేరిట ఉన్న భూమి ఇద్దరికి పంచిస్తాను.. దుబాయ్ వెళ్లి అప్పు తీర్చుకోవాలని గురువారం రాత్రి 11 గంటల వరకు భార్య భార్గవితో కలిసి కొడుకులకు సూచించాడు. అనంతరం బెడ్రూంలోకి వెళ్లిన సంజీవ్‌రెడ్డి తన ఫ్రెండ్స్ కు వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.
వారు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పడంతో తండ్రి, చిన్నకొడుకు కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే ఫ్యాన్ కు వేలాడుతున్న, అతడిని కిందికి దించి సీపీఆర్ చేశారు. అప్పటికే అతను మరణించాడు. మృతుడికి భార్య భార్గవి, రెండేళ్ల కూతురు ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
