- రూ.15 కోట్లతో 50 పడకల ఆస్పత్రికి కేంద్రం ఆమోదం
- రూ.7.5 కోట్ల నిధులు రిలీజ్
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాకు ఆయుష్ ఆస్పత్రి మంజూరైంది. కరీంనగర్ లో ఆయుర్వేదం, యోగా నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి సేవలతో 50 పడకల ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అల్లోపతి మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు గత కొంత కాలంగా ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ను కలిసి కరీంనగర్ లో ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్రంలో నాలుగో ఆయుష్ ఆస్పత్రి..
రాష్ట్రంలో ఇప్పటికే వికారాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లో ఆయుష్ ఆస్పత్రులు ఉన్నాయి. నాలుగో ఆస్పత్రి కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు కాబోతుంది. ఈ ఆస్పత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.7.5 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తక్షణమే తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆస్పత్రిని నిర్మించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. స్థల ఎంపిక, హాస్పిటల్ నిర్మాణంతోపాటు డాక్టర్లు, సిబ్బంది నియామక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుష్ అధికారులతో చర్చించారు. స్థల సేకరణపై దృష్టి సారించారు.
సగం నిధులు రిలీజ్..
ఆయుష్ డిపార్ట్మెంట్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 రేషియోలో ఉంటుంది. హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు అవసరమని నిర్ణయించగా, ఇందులో సివిల్ పనుల కోసం తొలి విడతగా 50 శాతం నిధులు అంటే రూ.7.50 కోట్లు కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటా కింద రూ. 6 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ పనులు ఒక నిర్దిష్ట దశకు చేరుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ను కేంద్రానికి సమర్పిస్తే వాటిని పరిశీలించి కేంద్రం తన మిగిలిన వాటాను విడుదల చేయనుంది.
మెడికల్ కార్పొరేషన్ కు బాధ్యతలు..
హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడం, భవన నిర్మాణం చేపట్టడం, వైద్య సిబ్బందిని నియమించడం వంటి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో హాస్పిటల్ నిర్మాణ పనులను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం.. 2026 మార్చి 31లోపు ఈ నిధులను వినియోగించాల్సి ఉంది. లేదంటే నిధులు లాప్స్ అయ్యే ప్రమాదం ఉంది.
ఆయుష్ తో అందించే చికిత్సలివే..
కరీంనగర్ లో 50 పడకల ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటైతే ఆయుర్వేద, హోమియోపతి, యోగా నేచురోపతి, యునాని, సిద్ద వైద్య చికిత్స సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు ప్రసూతి, స్ర్తీ రోగ చికిత్సలు, కాయకల్ప చికిత్స, పంచకర్మ, శల్య, శాలాక్య వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. 50 పడకల ఆస్పత్రిలో కాయచికిత్సకు 20, పంచకర్మ చికిత్సకు 10, శల్య సేవలకు 10, ఈఎన్టీ, ప్రసూతి, స్త్రీ ఆరోగ్య సేవలకు 5 పడకలను కేటాయించనున్నారు. ప్రతి విభాగానికి అర్హత, అనుభవం ఉన్న ఆయుష్ వైద్యులు అందుబాటులో ఉంటారు. యోగా ట్రైనర్ కూడా ఉంటారు. పరిపాలన విషయానికొస్తే మెడికల్ సూపరింటెండెంట్ తోపాటు ఇద్దరు డిప్యూటీ, అసిస్టెంట్ డైరెక్టర్స్(అడ్మిన్, ఫైనాన్స్), ఇద్దరు హెడ్ క్లర్క్స్, ఇద్దరు యూడీసీలు, ఏడుగురు ఎల్డీసీలు, 14 మంది నర్సింగ్ స్టాఫ్, ఇద్దరు నర్సులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫార్మాసిస్టులు సేవలందిస్తారు.
సంప్రదాయ వైద్యానికి పెద్దపీట
ప్రజలకు ఇంగ్లీష్ మందులతో పాటు సంప్రదాయ వైద్య విధానాలను చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కరీంనగర్ లో ఏర్పాటు కానున్న ఈ హాస్పిటల్ ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఆయుష్ వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. మ్యాన్ పవర్, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామని తెలిపారు.
