ఆటిజం కుటుంబ సమస్య కాదు.. సమాజం, ప్రభుత్వ సమస్య

ఆటిజం కుటుంబ సమస్య కాదు.. సమాజం, ప్రభుత్వ సమస్య
  • ఈ సమస్యతో పుడుతున్న పిల్లలు పెరుగుతున్నారని సీతక్క ఆందోళన
  • నయీ దిశ హెల్ప్ లైన్​ను ప్రారంభించిన మంత్రి 

హైదరాబాద్, వెలుగు: ఆటిజం సమస్య కుటుంబ సమస్య కాదని, సమాజం, ప్రభుత్వ సమస్య అని మంత్రి సీతక్క అన్నారు.  ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రోజురోజుకు ఈ సమస్యలతో జన్మిస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోందని, దీంతో తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటిజం, మేధో వైకల్యం, ఎదుగుదల లోపం ఉన్న పిల్లల కుటుంబాల కోసం నయీ దిశా ఎన్జీవో హెల్ప్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. 

వికలాంగుల పథకాలు, హక్కులు, ప్రయోజనాల కోసం ఈ హెల్ప్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నంబర్ ద్వారా కూడా ఇవన్ని తెలుసుకునే అవకాశాన్ని ఈ హెల్ప్ లైన్ అందిస్తోంది. ఈ మేరకు రిసోర్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆటిజంతో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవసరమైన సహాయం, సమాచారాన్ని, కౌన్సిలర్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, సామాజిక బృందం అందజేయనుంది. దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక జాబ్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిందని, వైకల్యం ఉంటే బాధపడకుండా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో మహిళ స్ర్తీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సంక్షేమ డైరెక్టర్ శైలజతో పాటు తదితరులు పాల్గొన్నారు.