
కడెం, వెలుగు: తనకు దొరికిన 16 తులాల బంగారాన్ని ఓ ఆటో డ్రైవర్ బాధితులకు అప్పగించాడు. కడెం మండల కేంద్రానికి చెందిన ఆరోగ్య మిత్ర సుజాత శనివారం తన కొడుకుతో కలసి బైక్ పై నిర్మల్ నుంచి ఖానాపూర్ కు వెళ్లింది. అయితే తన కూతురి పెళ్లి కోసం చేయించిన నగలు 16 తులాల బంగారం ఉన్న బ్యాగును మార్గమధ్యంలో కొండాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై పడవేసుకుంది. అదే సమయంలో నిర్మల్ నుంచి వస్తున్న లక్ష్మణచాంద మండలం రాచాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సాయికుమార్ బ్యాగుని గమనించి తీసుకున్నాడు. కాగా సుజాత బంగారం పోగొట్టుకున్న విషయం సామాజిక మాధ్యమాల తెలుసుకున్న సాయికుమార్.. ఆదివారం బాధితులకు సమాచారం అందించాడు. వారు రావడంతో 16 తులాల బంగారం బ్యాగును వారికి అప్పగించాడు.