RTA ఆఫీసుల్లో పనులు పునరుద్ధరించాలె : ఆటోడ్రైవర్లు

RTA ఆఫీసుల్లో పనులు పునరుద్ధరించాలె : ఆటోడ్రైవర్లు

హైదరాబాద్ : రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి RTA ఆఫీసుల్లో ఆటోడ్రైవర్లకు సంబంధించిన పనులు ఆగిపోవటం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాత ఆటోలను స్క్రాప్ చేసి కొత్త ఆటోలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా... స్క్రాప్ విధానం నిలిపివేయడం వల్ల వేలాది మంది ఆటోడ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. గతంలో ఎవరైనా ఆటోడ్రైవర్ కొత్త ఆటో కొనుక్కోవాలంటే పాత ఆటోను స్క్రాప్ చేసి.. కొత్త ఆటోను కొనుగోలు చేసే అవకాశం ఉండేదనే.. అయితే...ఇప్పుడు స్క్రాప్ ను తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల కొత్త ఆటో ధరలు భారీగా పెరిగి బ్లాక్ మార్కెట్ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వేలాది మంది ఆటోడ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. 

ఆటోల ఫిట్ నెస్, పర్మిట్ రెన్యువల్, కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు వంటి పనులు నిలిచిపోవడం వల్ల ఆటోడ్రైవర్లు చాలా నష్టపోతున్నారని తెలిపారు. కొంతమంది ఏజెంట్లు యూనియన్ ముసుగులో ఉండి RTA అధికారులతో పాటు స్క్రాప్ విధానంపైనా ఆరోపణలు చేయంతోనే పనులు నిలిచిపోయాయని, దీంతో ఆటోడ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. RTA ఆఫీసుల్లో నిలిపిన పనులను వెంటనే పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని, రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.