మహాలక్ష్మి మా పొట్ట కొట్టింది .. రూ.15 వేల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్​

మహాలక్ష్మి మా పొట్ట కొట్టింది .. రూ.15 వేల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్​
  • మా ఆటోల్లో లేడీస్​ఎక్కుతలేరు 
  • ఈఎంఐలు ఎట్లా కట్టాల్నో తెలుస్తలేదు
  • ఆటోడ్రైవర్ల ఆవేదన ..ఆందోళన

బోధన్, వెలుగు :  కాంగ్రెస్ ​ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మహాలక్ష్మి’ ( మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం) తమ పొట్టి కొట్టిందని సోమవారం పలు చోట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలకు దిగారు. నిజామాబాద్ ​జిల్లా బోధన్​లోని కొత్త బస్టాండ్ ఆవరణలో నిరసన తెలిపిన ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోకరమైనప్పటికీ, తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందారు. స్కీం ప్రారంభించినప్పటి నుంచి మహిళలెవరూ తమ ఆటోల్లో ఎక్కడం లేదని, దీంతో ఉన్న ఉపాధి పోయినట్టయ్యిందన్నారు.

అప్పులు, ఫైనాన్సులు తెచ్చి ఆటోలు కొన్నామని , వచ్చే నెల ఈఎంఐ కట్టే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఆటో యూనియన్ సభ్యులు ధర్నా చేశారు. తమను ఆదుకోవడానికి నెలకు రూ.15 వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత తహసీల్దార్​ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. తిరుపతి, శ్రీనివాస్, రమేశ్, పర్శరాములు పాల్గొన్నారు.  బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లు, ఓనర్లు నిరసన తెలిపారు.

యూనియన్ అధ్యక్షుడు కట్టారాం కుమార్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో తాము రోడ్డున పడాల్సి వస్తోందని, సర్కారు ఏదైనా ఉపాయం చేసి తమను ఆదుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆటో, జీప్, టాటా మ్యాజిక్  డ్రైవర్లు, యజమానులు ర్యాలీ తీశారు. తర్వాత తహసీల్దార్ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ రాంమోహన్ కు వినతిపత్రం అందజేశారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉచిత బస్సుసౌకర్యాన్ని రద్దు చేయాలని కోరారు. ఆటో ఓనర్స్ ,డ్రైవర్స్ అసోసియేషన్​ మండల ప్రెసిడెంట్ నసీరొద్దీన్, వైస్ ప్రెసిడెండ్ దుమ్మల్ల శంకర్, అసోసియేషన్ సభ్యులు ఈర్ల రమేశ్​, సాయి శివ, సామాజిక కార్యకర్త భూమాచారి పాల్గొన్నారు.