వామ్మో.. లండన్లో కిరాయికుండుడు కష్టమే

వామ్మో.. లండన్లో కిరాయికుండుడు కష్టమే

బ్రిటన్ రాజధాని లండన్లో ఇంటి అద్దెలు జనాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఇంటి ఓనర్లు భారీగా రెంట్లు పెంచడంతో ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ప్రస్తుతం లండన్ లో ఇంటి నెల కిరాయి సగటున రూ.2.5 లక్షలుగా ఉంది. నగరం నడిబొడ్డున రూ.3లక్షలు పెట్టినా ఇల్లు దొరకడం లేదు. ఒకవైపు కరెంటు ఛార్జీలతో సతమతమవుతున్న సామాన్యులు ఇప్పుడు భారీగా పెరిగిన ఇంటి అద్దెలతో ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ధరల కారణంగా లండన్లో సామాన్యుడు నివసించే పరిస్థితి లేకుండా పోయిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లండన్ లో గతేడాది చివరి 4  నెలల్లో ఇళ్ల అద్దెలు సగటున రూ. 2.50 లక్షలకు పెరిగాయని టెలిగ్రాఫ్ డైలీ కథనం ప్రచురించింది. ఇంటి అద్దెలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలోనే ఇదే తొలిసారి అని వెల్లడించింది. ఇదే అదనుగా కొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. లండన్ కు చెందిన ఓ బ్యాంకర్ తన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న పార్కింగ్ స్థలాలను ఆరేండ్ల పాటు కిరాయికిచ్చి రూ.7లక్షలు సంపాదించినట్లు మెట్రో న్యూస్ ఇటీవలే కథనం ప్రచురించింది.