రాష్ట్రానికి మరో 6 ఎయిర్​పోర్టులు.. ఎక్కడెక్కడంటే..

రాష్ట్రానికి మరో 6 ఎయిర్​పోర్టులు.. ఎక్కడెక్కడంటే..
  • ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నం: సింధియా
  • సీఎం కేసీఆర్​తో కేంద్ర మంత్రి భేటీ

హైదరాబాద్​, వెలుగు: వివిధ దేశాల నుంచి హైదరాబాద్​కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగినందున శంషాబాద్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని సివిల్​ ఏవియేషన్​ మినిస్టర్​ జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మంత్రి సింధియా.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు మధ్యాహ్న భోజనానికి ప్రగతి భవన్​కు వెళ్లారు. ఆ తర్వాత సమావేశంలో సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. రాష్ట్రం ఎకనమిక్ గ్రోత్ సెంటర్​గా అభివృద్ధి  చెందడంతోపాటు ఇంటర్నేషనల్ సిటీగా హైదరాబాద్  రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు. శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​నుంచి వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని కేంద్ర మంత్రిని కోరారు.  సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూఎస్ కు హైదరాబాద్  నుంచి డైరెక్ట్  ఫ్లయిట్స్ కనెక్టివిటీని పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని, శంషాబాద్​ ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

సింధియా మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వరంగల్ (మామునూరు) లో త్వరలో ఏటీఆర్  ఆపరేషన్స్  ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్ పల్లి)లో ఎయిర్ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తామని తెలిపారు. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టును ఎయిర్ ఫోర్స్ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్ నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాలు వచ్చిపోయేలా చేయడానికి పున: పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

వచ్చేది మా ప్రభుత్వమే: సింధియా
తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్నదని, రాబోయేది తమ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. కేంద్ర మంత్రి హోదాలోనే ప్రగతి భవన్ కు వెళ్ళినట్లు చెప్పారు. శనివారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సంకుచితంగా ఆలోచించాల్సిన అవసరం లేదని, కేంద్ర మంత్రిగా విధానపరమైన నిర్ణయాల ప్రకారమే సీఎం కేసీఆర్​ను కలిసినట్లు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ, జీహెచ్ఎంసీ, నిజామాబాద్, వరంగల్​లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే  ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.  ఎయిర్ పోర్టులను లీజుకు ఇస్తామని, పూర్తి గా ప్రైవేటీకరణ చేయమని ఆయన స్పష్టం చేశారు.