హైదరాబాద్‌లో న్యూ ఇయర్ రూల్స్ మస్ట్ గా పాటించాలి : అవినాష్​ మహంతి

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ రూల్స్ మస్ట్ గా పాటించాలి : అవినాష్​ మహంతి
  • రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు క్లోజ్​
  • క్యాబ్​, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నిబంధనలు ఫాలో కావాలి  
  • అర్ధరాత్రి అదనపు వసూళ్లకు పాల్పడితే డ్రైవర్లపై చర్యలు  
  • సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు మార్గదర్శకాలు జారీ

గచ్చిబౌలి, వెలుగు : న్యూ ఇయర్  సెలబ్రేషన్స్ సందర్భంగా సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​పరిధిలో  ట్రాఫిక్ మార్గదర్శకాలను జారీ చేశారు. న్యూ ఇయర్​ఈవెంట్స్, ట్రాఫిక్​ రద్దీపై సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అవినాష్​ మహంతి సిటిజన్స్​కు, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. న్యూ ఇయర్​ సందర్భంగా సైబరాబాద్​ పరిధిలోని ఫ్లై ఓవర్లను క్లోజ్​ చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్​ పోలీసులకు సహకరించి, ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలని సూచించారు.  ఔటర్ రింగ్ రోడ్డుపై, పీవీఎన్ఆర్​ ఎక్స్​ప్రెస్​ వే పై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వెహికల్స్ కు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ(1 & 2), షేక్ పేట్, మైండ్ స్పేస్, రోడ్ నెం.45 , దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ , ఫోరం మాల్ జేఎన్​టీయూ, ఖైత్లాపూర్ , బాబు జగ్జీవన్ రామ్ (బాలానగర్) ఫ్లై ఓవర్లపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేసి ఉంటాయని వివరించారు.  

ఐటీ కారిడార్​లో క్యాబ్​లు, ట్యాక్సీలు, ఆటోల డ్రైవర్లు కచ్చితంగా రూల్స్​ ఫాలో కావాలని, యూనిఫామ్ ధరించి, అన్ని డాక్యుమెంట్స్ వెంట ఉంచుకోవాలని, రైడ్ నిరాకరిస్తే.. చట్ట ప్రకారం రూ. 500 ఫైన్​వేస్తామని హెచ్చరించారు.  ఎవరైనా  ఉల్లంఘనకు పాల్పడితే వాట్సాప్ 9490617346 కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. 

ఆర్గనైజర్లపైనే బాధ్యత

బార్​, పబ్​, క్లబ్​లలో కస్టమర్లు మద్యం తాగి వాహనాలను నడపకుండా చూడాల్సిన బాధ్యత ఆర్గనైజర్లపైనే ఉందని తెలిపారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చడం జరిగిందని అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సైబరాబాద్ పరిధిలోని రాత్రి 8 గంటల నుంచి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, సరైన పత్రాలు చూపకుంటే పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు. వాహనాలలో అధిక-డెసిబుల్ సౌండ్, మ్యూజిక్ సిస్టమ్​ను వాడడంపై బ్యాన్​ విధించామని, అలా చేస్తే వాహనాలు సీజ్​చేస్తామన్నారు.

తాగి డ్రైవింగ్​చేస్తే కఠిన శిక్షలు 

 మద్యం తాగి వెహికల్​ డ్రైవ్​చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మొదటి నేరానికి ఫైన్ రూ. 10 వేలు లేదా 6 నెలల జైలు శిక్ష,  రెండుకంటే ఎక్కువసార్లు నేరానికి పాల్పడితే  రూ. 15 వేలు లేదా  2 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొన్నారు. మోటారు వాహనాల చట్టం –1988లోని సెక్షన్ 19 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కు స్వాధీనం చేసుకుని సంబంధిత ఆర్టీఓలకు అప్పగిస్తామన్నారు. 

మద్యం తాగి వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైతే ఐపీసీలోని U/s 304 పార్ట్ -II కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు న్యూఇయర్​ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, వాహనదారులు రూల్స్​ ఫాలో కావాలని సీపీ అవినాష్ మహంతి  సూచించారు.