
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్–రంగారెడ్డి- – మహబూబ్‌నగర్- టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్రెడ్డి ముందంజలో ఉన్నారు. ఫస్ట్ ప్రయార్టీ ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7,505 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డికి 6,584, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డికి 4,569, కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డికి 1,907 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి 1,236 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అయితే, పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థికి కూడా 50 శాతం కంటే ఎక్కువ ఫస్ట్ ప్రయార్టీ ఓట్లు రాకపోవడంతో, అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత ఏ అభ్యర్థికి 12,709 ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు.
పోలైన ఓట్లు 25,866
ఈ నెల13న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరిగింది. మొత్తం 29,720 ఓట్లలో 25,866 ఓట్లు పోలయ్యాయి. గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా సారథ్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 11 గంటల వరకు బ్యాలెట్ పేపర్లను 50 చొప్పున బండిల్స్ కట్టారు. 950 చొప్పున బ్యాలెట్ పేపర్లను 28 టేబుల్స్ కు పంపిణీ చేశారు. ఆ తరువాత ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 4 గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇందులో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్రెడ్డి.. పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డిపై 921 ఓట్ల మెజార్టీతో ముందంజలో నిలిచారు. అయితే, 50శాతం ఓట్లు రాకపోవడంతో, సెకండ్ ప్రయార్టీ ఓట్ల ప్రక్రియ మొదలుపెట్టారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ మొదలైంది.
452 చెల్లని ఓట్లు..
మొత్తం 25,868 ఓట్లు పోలింగ్ కాగా, ఇందులో 452 ఓట్లు చెల్లలేదు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే ప్రయార్టీ ఇవ్వడం తదితర కారణాలతో వాటిని చెల్లని ఓట్లుగా పరిగణనలోకి తీసుకొని పక్కన పెట్టారు.
కరెంటు పోయి కొద్దిసేపు అంతరాయం
మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో మధ్యలో కరెంట్ పోయింది. దీంతో లోపల అంతా చీకట్లు అలుముకున్నాయి. దీంతో అధికారులు కౌంటింగ్ ఆపేశారు. 10 నిమిషాల తర్వాత కరెంట్ రావడంతో తిరిగి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
అభ్యర్థుల ఓట్ల వివరాలు
అభ్యర్థి ఫస్ట్ ప్రయార్టీ 19 రౌండ్లు పూర్తయ్యేవరకు
ఏవీఎన్ రెడ్డి 7,505 9,259
చెన్నకేశవరెడ్డి 6,584 7,947
మాణిక్ రెడ్డి. 4,569 6,079
హర్షవర్ధన్ రెడ్డి 1,907 –
జనార్దన్ రెడ్డి 1,236 –
భుజంగరావ్ 1,103 –
కె ప్రభాకర్ 764 –
వినయబాబు 568 –