‘జీ రామ్ జీ’తో కాంగ్రెస్ కథ ముగిసినట్టే : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

‘జీ రామ్ జీ’తో కాంగ్రెస్ కథ ముగిసినట్టే :  చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సవరణలు విజయవంతమైతే రాజకీయంగా కాంగ్రెస్​ కథ ముగిసినట్లేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్​లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సవరణలతో పథకం మరింత పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు. 

ఈ పథకాన్ని ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’గా పేరు మార్చి 100 రోజుల నుంచి 125 రోజులకు గ్రామీణ ప్రజలకు పని దినాలను కేంద్రం పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటా ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువ భారం పడుతుందన్నారు. 

సవరణలతో సర్పంచ్, గ్రామస్తులు కలిసి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో కాంగ్రెస్  మనుగడ కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. గాంధీ పేరు మార్పుపై జనవరి 10 నుంచి ఉద్యమం చేసి ప్రజల దృష్టి మరల్చాలని కాంగ్రెస్  ప్రయత్నం చేస్తుందన్నారు. దేశంలో కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు.

 వికారాబాద్  జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండు చైర్మన్  స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా కన్వీనర్  కరుణం ప్రహ్లాద్ రావు, జిల్లా ఇన్‌‌చార్జి సుధాకర్ రావు, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్ కుమార్  పాల్గొన్నారు