- బిల్డింగ్ ఓనర్లతో కుమ్మక్కై కమీషన్లు దండుకున్నరు
- కాంగ్రెస్ హయాంలోనే విద్యా రంగానికి గుర్తింపు దక్కిందని వ్యాఖ్య
- మంచిర్యాలలోని జిల్లా హాస్పిటల్, గురుకుల డిగ్రీ కాలేజ్ సందర్శన
కోల్‌బెల్ట్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నాశనమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలకు పక్కా భవనాలు నిర్మించకపోవడంతో చాలా విద్యాసంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. బిల్డింగ్‌ల ఓనర్లతో బీఆర్ఎస్ లీడర్లు కమీషన్ మాట్లాడుకుని ఎక్కువ రెంట్ చెల్లించారని ఆరోపించారు. అప్పట్లో బీఆర్ఎస్ కు కమీషన్లపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధిపై లేదని విమర్శించారు.
మంచిర్యాలలోని గవర్నమెంట్ హాస్పిటల్, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కాలేజీని ఆయన మంగళవారం సందర్శించారు. ట్రినిటీ హైస్కూల్ క్రీడోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకొని మిషన్ భగీరథ తదితర అన్ని స్కీమ్‌లలో కమీషన్ల రూపంలో కోట్లు దండుకున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నది. గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీల కోసం పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. స్టూడెంట్లకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంట. మంచిర్యాల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కాలేజ్‌లో స్టూడెంట్లు లేరనే సాకుతో నిర్మల్‌కు తరలించిన విషయం నా దృష్టికి వచ్చింది. మంచిర్యాలలోనే కాలేజీ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన” అని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.
క్రీడలతో లీడర్షిప్లక్షణాలు
చదువుతో పాటు ఆటల్లోనూ రాణించే స్టూడెంట్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ‘‘క్రీడలతో స్నేహభావం, క్రమశిక్షణ, లీడర్షిప్ లక్షణాలు పెరుగుతాయి. మానసిక ఉల్లాసం, బాడీ ఫిట్నెస్ మెరుగుపడ్తది’’అని ఆయన తెలిపారు. మంచిర్యాలలోని ట్రినిటీ హైస్కూల్ క్రీడోత్సవాలకు వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘విద్యతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. గ్రామీణ ప్రాంత స్టూడెంట్లలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి.. వారిని ప్రోత్సహించేందుకు విద్యా సంస్థలు సహకరించాలి. స్టూడెంట్లు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి’’అని సూచించారు.
మందుల కొరత ఉండొద్దు
మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. వార్డులను పరిశీలించిన ఆయన.. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ‘‘మందుల కొరత ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది. వెంటనే మెడిసిన్స్ తెప్పించి అందుబాటులో ఉంచాలి. హాస్పిటల్ వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి’’అని ఆయన సూచించారు.
జిల్లా కేంద్రంలోని మార్కెట్ ను సందర్శించి కూరగాయల వ్యాపారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం రతన్‌లాల్ చాయ్ హోటల్లో పార్టీ కార్యకర్తలు, స్థానికులతో కలిసి టీ తాగారు. ఎంపీ వెంట డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ సుధామల్ల హరికృష్ణ, డీసీసీ సెక్రటరీ నల్ల రవి తదితరులున్నారు.
