నేషనల్ హెరాల్డ్ కేసు ఒక దురుద్దేశం

నేషనల్ హెరాల్డ్ కేసు ఒక దురుద్దేశం

ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు..  నేషనల్ హెరాల్డ్  కేసులో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్​ను  కొట్టివేసిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఈ కేసును  ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద విచారణ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోగ్నే అన్నారు. 

ఈ వ్యాఖ్యలు  సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నిజాయితీ, నైతికతకు మరింత ఊతమిచ్చాయి. స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్న కాలం 1938లో  జవహర్ లాల్  నెహ్రూ ‘ది నేషనల్ హెరాల్డ్’  ఆంగ్ల పత్రికను స్థాపించారు. ఈ పత్రిక దేశ ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్షలకు ఒక గొంతుకగా ఉపయోగపడింది.

నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ పత్రికపై అనేకసార్లు నిషేధం విధించింది. 90వ  దశకం వచ్చేవరకు ఈ పత్రిక ప్రభావం తగ్గి మూతపడింది.  తిరిగి  మళ్లీ  ప్రారంభమైనా ఆర్థిక ఇబ్బందులతో 2008లో పూర్తిగా మూతపడింది. నెహ్రూ స్థాపించిన ఈ పత్రికను తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో 2010లో  కాంగ్రెస్ పార్టీ  ‘యంగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ’ని స్థాపించింది.  

ఇందులో  సోనియా గాంధీ,  రాహుల్ గాంధీ, శ్యాం పిట్రోడా,  సుమన్ దూబే, సునీల్ బండారి తదితరులు వాటాదారులు.  యంగ్ ఇండియా కంపెనీలో  నేషనల్ హెరాల్డ్  పత్రిక  ఆస్తులను కలిపారు. దీంతో పత్రిక తిరిగి ప్రారంభమైంది. 2012లో  బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి  నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను మనీలాండరింగ్ చేశారని,  గాంధీ కుటుంబం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుందని సీబీఐ, ఈడీలకు ప్రైవేటు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి గత 13 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. 

ఇది రాజకీయ దురుద్దేశంతో వేసిన కేసు మాత్రమే. ఇందులో  మనీలాండరింగ్ జరిగిందని ఎలాంటి ఆధారాలు లేవు.  గాంధీ కుటుంబం పత్రిక ఆస్తులను వారి పేరు మీద మార్చుకున్నారని ఒక్క ఆధారం కూడా నేటికీ లభించలేదు. ఈ కేసు వేసిన సుబ్రహ్మణ్యస్వామికి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. 

ప్రతిపక్ష నాయకులపై కేసులు 

గాంధీ కుటుంబాన్ని అవినీతిపరులుగా చూపడం, వారి మీద రాజకీయ బురద జల్లడం కోసం ఈ కేసును బీజేపీ ప్రభుత్వం వాడుకుంది.  కృత్రిమ సాక్ష్యాలను సృష్టించి రాహుల్ గాంధీని జైలుకు పంపాలని అనేక ప్రయత్నాలు చేసింది.  కానీ,  రాహుల్ గాంధీ  మొక్కవోని  ధైర్యంతో,  నిజాయితీతో  వీటన్నిటినీ ఎదుర్కొంటున్నాడు.  దేశంలోని  పేద,  దళిత,  బడుగు,  బలహీన, మైనార్టీ ప్రజల గొంతుకగా ఉన్న రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురి చేయడమే ఈ అక్రమ కేసు  లక్ష్యం.  

దీనికోసం గోది మీడియా ద్వారా నిరంతరం గాంధీ కుటుంబం మీద విషం చిమ్ముతూనే ఉన్నారు.  గత 11 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై సీబీఐ,  ఈడీ  కేసులను బనాయిస్తోంది. బీజేపీలో చేరిన ఆ  నాయకులపై  కేసులు నీరుగారేలా చేస్తుంది. కానీ, బీజేపీకి భయపడకుండా  నిలబడ్డ ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపుతుంది.  

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్​ను ఐదు నెలలు జైలుకు పంపింది. నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ను  జైలుకు  పంపింది. ఇలా గత  పదకొండు ఏండ్లలో మొత్తం 50 మంది  ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ కేసులను నమోదు చేసింది. ఈడీ ఇప్పటివరకు నమోదు చేసిన కేసులలో నేరం నిరూపణ అయి శిక్షపడ్డ కేసులు ఒక శాతం లోపే. అంటే మిగతా 99 శాతం రాజకీయ దురుద్దేశంతో బనాయిస్తున్న కేసులే అన్నమాట.

ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు

నేషనల్ హెరాల్డ్  కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అనేకసార్లు విచారణ చేసింది. ఈ కేసులో రాహుల్ గాంధీని ఈడీ 50 గంటలకు పైగా విచారణ చేసింది. కానీ,  బీజేపీ నేతలపై వచ్చే అవినీతి ఆరోపణల మీద సీబీఐ గానీ,  ఈడీగానీ  విచారణ చేయవు.  అంతెందుకు నేషనల్ హెరాల్డ్ కేసు వేసిన బీజేపీ  నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రస్తుత ప్రధాని మోదీపై అనేక ఆరోపణలు చేస్తున్నారు.  వీటిపై  సీబీఐ లేదా ఈడీ ఎలాంటి విచారణ చేయడం లేదు.

 బ్యాంకులకు  వేలకోట్లు ఎగ్గొడుతున్న కంపెనీలపై  ఈడీ విచారణ చేయడం లేదు.  ఎందుకంటే ఆ కంపెనీలు బీజేపీకి ఎన్నికల విరాళాలు ఇస్తున్నాయి కాబట్టి.  వేలకోట్ల  దేశ  ప్రజల  సొమ్మును  దోచుకొని  విదేశాలలో విలాసవంతమైన  జీవితం  గడుపుతున్న పెట్టుబడిదారులకు  ఇంతవరకు ఎలాంటి శిక్షలు పడలేదు. 

 కానీ,  దేశ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేసిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు.  ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత  విషప్రచారం చేసినా గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవ,  వారి త్యాగం ముందు అవి నిలబడవు.  దానికి రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనం.  దేశ ప్రజల హృదయాలలో  గాంధీల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయం.

- నుమాన్ మహమ్మద్,ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్