నేడు వెనెజువెలా, రేపు ఏ దేశమో?

నేడు వెనెజువెలా, రేపు ఏ దేశమో?

వెనెజువెలా దేశంపై దాడి చేసి అధ్యక్షున్ని బందీ చేయడం ద్వారా అమెరికా అంతర్జాతీయ న్యాయ సూత్రాలని, మర్యాదల్ని, హక్కుల్ని తుంగలో తొక్కింది.  ఈ దురాక్రమణకు పాల్పడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడి కాంగ్రెస్ అనుమతులు తీసుకోలేదు.  ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చించనూ లేదు. 

వెనెజువెలా అధ్యక్షుడిపై  ట్రంప్​ చేస్తున్న ఆరోపణలకు  ఋజువులు లేవు.  ఆ సార్వభౌమ దేశం వల్ల అమెరికాకు జరిగే తక్షణ అపకారం, బెదిరింపులు ఏమీ లేవు.  అమెరికా దురాక్రమణను  ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాలి. 1999లో  హ్యూగో చావెజ్ అధికారంలోనికి  వచ్చిన వెంటనే  వెనెజువెలాలో  అమెరికా ఆధిపత్యంలోని ప్రైవేట్ చమురు కంపెనీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు.  ఆయన హయాంలో పేదరికం ఒక్కసారిగా 70 శాతానికి పైగా తగ్గింది. 

నిరుద్యోగం సగానికి సగం పడిపోయింది.  పెన్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. అక్షరాస్యత 100 శాతానికి చేరుకుంది.  విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఆహార భద్రత అక్కడ ప్రాథమిక హక్కులుగా కల్పించారు. దాదాపు వంద ఏళ్లపాటు ఆ దేశ సంపదనంతా తరలించుకుపోయిన అమెరికా చమురు కంపెనీలను చావేజ్ స్వాధీనం చేసుకుని.. వాటి ద్వారా వచ్చే ఆదాయంలో 65 శాతం దేశప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టారు. అప్పటినుంచి అమెరికా కడుపుమంట మొదలైంది. 

వెనెజువెలా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం. ఆ చమురు నిలువల్ని తమకు నచ్చినవారికి నచ్చిన ధన రూపంలో మారకం చేస్తున్నాయి. డాలర్ పై ఆధారపడడం లేదు.  అక్కడి ప్రభుత్వం మారి తమ మాట వినే పాలకులు పదవి చేపడితే తప్ప అమెరికా ప్రయోజనాలు నెరవేరవు.  దీంతో  వెనెజువెలా అధ్యక్షుడు మాదకద్రవ్యాల సరఫరా  ప్రోత్సహిస్తున్నాడని అందువల్ల అమెరికాలో అవి విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు విరుచుకుపడుతున్నాడు. 

అమెరికా నిఘా సంస్థలు,  వివిధ రకాల (18 ) ఏజెన్సీల సమాచారం ప్రకారం.. అగ్రరాజ్యానికి  డ్రగ్స్​రవాణా చేసే దేశాల్లో  వెనెజువెలా  లేదు.  ఆ దేశంలోని  రెండు ప్రధాన డ్రగ్ సిండికేట్లతో అధ్యక్షుడు మదురోకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు కూడా లేవని అమెరికా నిఘవర్గాలే చెబుతున్నాయి. వెనెజువెలాను లోబర్చుకునేందుకు ట్రంప్ వేసే కొత్త ఎత్తుగఢలో భాగమే ఈ కుట్ర.

 చమురు, ఖనిజాల ఆక్రమణకే దాడి

వెనెజువెలాలో ఉన్న చమురు, ఖనిజాలు వనరులన్ని అమెరికా సొంతమని, వాటిని తమకు స్వాధీనం చేయాలని,  నికోలస్ మదురో గౌరవప్రదంగా పదవి నుంచి వైదొలగాలని,  లేకపోతే తామే బల ప్రయోగం చేస్తామన్న ట్రంప్ ఒత్తిళ్లకు మదురో తలవంచలేదు.  ఐక్యరాజ్యసమితికి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. 

చివరకు కొత్త సంవత్సరం మొదటి వారంలోనే  మదురోను బందీ చేశారు. వెనెజువెలాలో ఉన్న ప్రకృతి వనరులను దోచుకోవడం కోసం ట్రంప్ ఒక పథకం ప్రకారం మదురోపై ఆరోపణలు ప్రారంభించారు. 2017లోనే  ట్రంప్​ సూచనప్రాయంగా అధికారంలోనికి వచ్చినప్పుడు వెనెజువెలాపై  సైనిక దాడులను తోసిపుచ్చలేమని సంకేతాలు ఇచ్చారు. 

మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారులకు  డ్రగ్స్ ముఠాలకు ఆయన ఆశ్రయం ఇస్తున్నారని,  వెనెజువెలా  ముడి చమురు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని డ్రగ్స్ కోసం  ఉపయోగిస్తున్నారని ట్రంప్ ఆరోపణలు ప్రచారంలో పెట్టారు.

ప్రపంచ దేశాల ఖండన

రానున్న రోజుల్లో  కొలంబియా, క్యూబాలను కూడా  వెనెజువెలా బాట పట్టిస్తామని ట్రంప్ హెచ్చరించి బెదిరిస్తున్నాడు. ఇది ప్రపంచ దేశాల్ని ప్రమాదంలోకి నెట్టి అరాచక ధోరణి.  అంతర్జాతీయ సమాజం  ప్రతిస్పందించకపోతే తీరని నష్టం తప్పదు.  సెప్టెంబర్ నెల నుంచి కరేబియన్ జలాల్లో మానవ హక్కులు ఉల్లంఘించి అమెరికా అనేక పడవలపై దాడులు చేసింది.  

వెనెజువెలాపై అమెరికా జరిపిన దాడులను చైనా, రష్యా,  టర్కీ, ఇరాన్, ఫ్రాన్స్, అర్జెంటీనా, స్పెయిన్,  ఇండోనేషియా,  మెక్సికో,  క్యూబా, కొలంబియా, యూకే తదితర దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. వెనెజువెలాపై  అమెరికా డెల్టా ఫోర్స్ దాడులను  రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.    వెనెజువెలా ప్రజలకు రష్యా తన సంఘీభావం ప్రకటించింది. 

వెనెజువెలా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి  వీలుగా బోలివీరియన్ నాయకత్వానికి తమ మద్దతు పునరుద్ఘాటిస్తున్నట్లు  తెలిపింది.  అమెరికా సాకులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని పేర్కొంది.  వెనెజువెలాపై ట్రంప్​ మిలిటరీ చర్యను  అమెరికా ప్రత్యర్థి దేశాలతోపాటు మిత్రపక్షాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ సమస్యపై  చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమయింది. 

అమెరికాను ఏకాకిగా మార్చాలి    

వెనెజువెలాపై అమెరికా చర్య అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సెక్రటరీ జనరల్  ఆంటోనియో గుటెర్రస్ అన్నారు.  దేశ విదేశాలలో అమెరికా దుశ్చర్యను ఖండిస్తూ ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.  ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా దురాక్రమణపై పోరాడాలి. ఈ విషయంలో అమెరికాను ఏకాకిగా మార్చాలి. లేదంటే ప్రపంచంలో అమెరికా కుట్రలకు ఏ దేశమూ భద్రంగా ఉండే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రతి దేశమూ గమనించాలి. 

 ట్రంప్ దొంగ దెబ్బ 

 గత సెప్టెంబర్ నెల నుంచి కరేబియన్ జలాల్లో మానవ హక్కులు ఉల్లంఘించి అమెరికా అనేక పడవలపై దాడులు చేస్తున్నారు.  గేరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌక సహా50 వేలకు పైగా సైన్యాన్ని  వెనెజువెలా వెలుపల జలాల్లో మోహరించారు. దాదాపు 100 మంది ఈ దాడుల్లో మరణించారు. ఆ తర్వాత వెనెజువెలా నుంచి చమురు ఎగుమతులు జరగకుండా అడ్డుకున్నారు.  వారి మూడు చమురు నౌకలను  అమెరికా సైన్యం తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నది.  

ఆ తర్వాత  వెనెజువెలాలో  డ్రగ్స్ ఎగుమతి  రేవులపై  సీఐఏ సారథ్యంలో  డ్రోన్ల దాడి చేశామని  గత వారం అమెరికా ప్రకటించింది.  కొలంబియా కమ్యూనిస్టు పాలకులపై కూడా ట్రంప్ ఇదే విధంగా డ్రగ్స్ ఆరోపణలు చేశారు.  అమెరికా దురహంకారం ప్రపంచానికి కొత్త కాదు. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు అనేకం దాని బారినపడ్డాయి.  

కుట్రలు చేసి దేశాధినేతల్ని హతమార్చటం, ప్రజాస్వామ్య డ్రామాలు నడిపి వ్యవస్థల్ని కూల్చివేయటం దానికి మంచినీళ్ల ప్రాయం. ఇలాగే గతంలో పనామా పట్ల కూడా అమెరికా వ్యవహరించింది. అమెరికా చర్యల పర్యవసానంగా ఇటీవలి దశాబ్దాల్లో ఇరాక్, లిబియా, ఆఫ్గనిస్తాన్​ నెత్తుటి ముద్దలయ్యాయి. 


- ఉజ్జిని రత్నాకర్ రావు,సీపీఐ సీనియర్​ నేత