కుల, మతాల పేరుతో ప్రచారం మానుకోండి

కుల, మతాల పేరుతో ప్రచారం మానుకోండి
  •  బీజేపీ, కాంగ్రెస్‌‌ పార్టీలకు ఈసీ సూచన

న్యూఢిల్లీ: ఎన్నికల్లో కులం, మతం, వర్గం, భాషలను ప్రస్తావిస్తూ ప్రచారం చేయడం మానుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌‌ పార్టీలకు ఎన్నికల కమిషన్‌‌ (ఈసీ) సూచించింది. ఎన్నికలతో దేశ సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని దెబ్బతీయడానికి వీల్లేదని పేర్కొంది. రాజస్థాన్‌‌లోని బన్‌‌స్వారా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ దేశ విభజన ప్రసంగం చేశారని ప్రతిపక్షం ఆరోపించడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసు జారీ చేశామని ఈసీ తెలిపింది. 

ఈ సందర్భంగా మోదీ, ఆ పార్టీ స్టార్‌‌‌‌ క్యాంపెయినర్లు మతపరమైన ప్రచారం మానుకోవాలని కోరింది. సమాజాన్ని విభజించే ప్రచార ప్రసంగాలను ఆపాలని కూడా బీజేపీకి సూచించింది. అలాగే, బీజేపీ, ఆ పార్టీ నాయకులపై రాహుల్‌‌ గాంధీ ఆరోపణలు చేశారని, వీటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌‌ ప్రెసిడెంట్‌‌ మల్లికార్జున్‌‌ ఖర్గేకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. దేశ రక్షణ దళాలను రాజకీయం చేయొద్దని, సాయుధ బలగాలపై ఎలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని కోరింది.

 రాజ్యాంగం మార్పుపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్‌‌ స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులకు సూచించింది. ప్రచారంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్‌‌, బీజేపీ స్టార్‌‌‌‌ క్యాంపెయినర్లకు పార్టీ జాతీయ అధ్యక్షుడు 
ఓ నోటీసును జారీ చేయాలని చెప్పింది.