కొట్టేసిన క్యాష్ బాక్స్.. కాంప్లెక్స్ లో ఖాళీ

కొట్టేసిన క్యాష్ బాక్స్.. కాంప్లెక్స్ లో ఖాళీ

హైదరాబాద్ : వనస్థలిపురం యాక్సిస్ ఏటీఎమ్ క్యాష్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలు కొట్టేసిన క్యాష్ బాక్స్ ను ముసారాంబాగ్ సులభ్ కాంప్లెక్స్ లో స్వాధీనం చేసుకున్నారు. పక్కా స్కెచ్ వేసి రూ.58.97 లక్షలు కొట్టేసిన దొంగల ముఠా నిమిషాల వ్యవధిలో క్యాష్ బాక్స్ ను ఖాళీ చేసినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10.03 గంటలకు పనామా చౌరస్తాలో క్యాష్ బాక్స్ ను దొంగిలించి ముసారాంబాగ్ కు తరలించారు. పనామా నుంచి ముసారాంబాగ్ దాకా ఒకే ఆటోలో ప్రయాణించారు. 10.46 నిమిషాలకు కోణార్క్ డయాగ్నసిస్ సెంటర్ ముందు నలుగురు ఆటో దిగి, చౌరస్తా నుంచి కొంత దూరంలో ఉన్న టకాటక్ సులభ్ కాంప్లెక్స్ కాడికి చేరుకున్నారు. ఇద్దరు క్యాష్ బాక్స్ పట్టుకోగా మరో ఇద్దరిలో ఒకరు ముందు మరొకరు వెనుక నడిచినట్టు పోలీసులు భావిస్తున్నారు.

దృష్టి మళ్లించి.. మాటల్లోపెట్టి

బ్యాగులతో వచ్చిన దొంగలు సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే బీహార్ కు చెందిన పర్వింద్ రామ్ దృష్టి కూడా మళ్లించారు. నలుగురిలో ఇద్దరు కాంప్లెక్స్ కు రెండు చివర్లలో నిలబడి, క్యాష్ బాక్స్ తో ఉన్న ఇద్దరు సులభ్ కాంప్లెక్స్ లోపలికి వెళ్లారు.  పర్వింద్ రామ్ కు అనుమానం రాకుండా ఉండేందుకు బయట నిల్చున్న ఇద్దరిలో ఒకరు కాంప్లెక్స్ చివర్లో డబ్బులు పడ్డాయని చెప్పారు. దీంతో దొంగల ముఠా పడేసిన రూ.100లు కోసం పర్విందర్ అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో బయటే ఉన్న మరో వ్యక్తి కాంప్లెక్స్ లోపలికి వెళ్లి అందులో ఉన్న ఇద్దరితో జతకలిశాడు. సులభ్ కాంప్లెక్స్ బయటే ఉన్న మరో దొంగ పర్విందర్ రామ్ ను మాటల్లో పెట్టి కాంప్లెక్స్ లోపలికి వెళ్లకుండా మాటల్లో పెట్టాడు.

రాంజీనగర్​గ్యాంగ్ కోసం సెర్చ్

ఈ కేసును సవాల్ గా తీసుకున్న రాచకొండ పోలీసులు ఎనిమిది బృందాలతో రాంజీనగర్​గ్యాంగ్ కోసం సెర్చ్​ చేస్తున్నారు. తమిళనాడు, బెంగళూర్, ఆంధ్రప్రదేశ్​తో పాటు హైదరాబాద్ లోని అనుమానాస్పద ప్రాంతాల్లో ముఠా కోసం గాలిస్తున్నారు. రైల్వే, బస్ స్టేషన్ల సమీపంలోని లాడ్జిలు, హోటళ్లలో సెర్చ్ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ల ఆధారంగా తమిళనాడు, బెంగళూర్ పోలీసులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను కరించి దీపక్ గ్యాంగ్ గా గుర్తించారు. చోరీ చేసిన వారి ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో ఆరా తీస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగా కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు తక్కువ టైంలోనే దొంగలను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.