హీరో తల్లిని.. రూ.58 లక్షలకు మోసం చేశాడు

హీరో తల్లిని.. రూ.58 లక్షలకు మోసం చేశాడు

జాకీ ష్రాఫ్ భార్య,టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్.. MMA మ్యాట్రిక్స్ కంపెనీ ఆపరేషన్స్ డైరెక్టర్‌ అలాన్ ఫెర్నాండెజ్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. టైగర్ ష్రాఫ్ జిమ్ పేరు వాడుకుని.. వివిధ టోర్నమెంట్లు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు కాజేశారన్నది నిందితుడిపై ప్రధాన ఆరోపణ. దాదాపు రూ.58 లక్షల మేర మోసం చేసినట్లు ఆమె శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయేషా శ్రాఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపిసి సెక్షన్ 420, 408, 465, 467, 468 కింద అభియోగాలు నమోదు చేశారు. 

ఆరోపణలు ఎదుర్కుంటున్న అలాన్ ఫెర్నాండెజ్ 2018లో MMA మ్యాట్రిక్స్ కంపెనీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి MMA మ్యాట్రిక్స్ కంపెనీ జిమ్ టైగర్ ష్రాఫ్ యాజమాన్యంలో ఉంది. కానీ ఇండస్ట్రీలో అతడికి ఉన్న కమిట్మెంట్ల కారణంగా.. అతని తల్లి అయేషా జిమ్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మార్షల్ ఆర్ట్స్ రిక్రూట్‌మెంట్‌లకు శిక్షణ ఇవ్వడానికి అలాన్ రూ.3 లక్షల వేతనానికి ఉద్యోగంలో చేరాడు.

కానీ అలాన్ మాత్రం టోర్నీల నిర్వహణ ముసుగులో తప్పుడు మార్గంలో భారీగా డబ్బు కూడబెట్టాడు. టైగర్ ష్రాఫ్ జిమ్ పేరును వాడుకుని..  భారతదేశంలో మాత్రమే కాక విదేశాలలో కూడా మొత్తం 11 టోర్నమెంట్‌లు నిర్వహించారు. ఫలితంగా డిసెంబర్ 2018 నుండి జనవరి 2023 వరకు కంపెనీ బ్యాంక్ ఖాతాలో రూ. 58,53,591 జమ చేశాడు.