అయోధ్యలో కోదండరామయ్య కొలువుదీరే.. ఘడియ ఆసన్నం

అయోధ్యలో కోదండరామయ్య కొలువుదీరే..   ఘడియ ఆసన్నం

 

  •     వారం రోజుల క్రతువులు పూర్తి.. తుది ఘట్టానికి ఘనంగా ఏర్పాట్లు
  •     రామ నామంతో మార్మోగుతున్న అయోధ్య నగరం
  •     వీధివీధినా రాముడి పోస్టర్లు, కటౌట్లు, అలంకరణలు
  •     సాధువులు, సెలబ్రిటీలు సహా వేలాది ఆహ్వానితుల రాక
  •     ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లోని గుడుల్లోనూ సంబురాలు

అయోధ్య (యూపీ):  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన శుభ ఘడియలు రానే వచ్చాయి. అయోధ్యలో కోదండ రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నమైంది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్య ఆలయంలో రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు షురూ కానుంది. సుమారు 40 నిమిషాలపాటు జరగనున్న ఈ శుభ కార్యానికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సర్వం సిద్ధం చేసింది. ప్రధాని మోదీతోపాటు వివిధ రంగాల సెలబ్రిటీలు, పార్టీల నేతలు, సాధువులు, భక్తులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు హాజరుకానున్నారు. 

ప్రాణ ప్రతిష్ఠ సంబురాల నేపథ్యంలో అయోధ్యతోపాటు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామానా టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో వీహెచ్ పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలోనూ సంబురాలు చేయనున్నారు. ఇక రామ జన్మభూమి అయిన అయోధ్య అంతా రామమయం అయింది. అందమైన పూలు, రంగురంగుల లైట్లతో చేసిన అలంకరణలు రాముడి ఆలయాన్ని మరింత శోభాయమానం చేస్తున్నాయి. 

వీధివీధినా కాషాయ జెండాలు, రాముడి పోస్టర్లు, కటౌట్లతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా లౌడ్ స్పీకర్ల నుంచి రామనామంతో అయోధ్య మారుమోగుతోంది. వీధుల్లో కళాకారులు నెమలి ఫించాలు కట్టుకుని నృత్యాలు చేస్తూ, సీత, రాముడు, లక్ష్మణ, భరత, శత్రఘ్నులతోపాటు హనుమంతుడి వేషధారణతో కనిపిస్తున్నారు. భక్తులు రామ భజనలు చేస్తూ, కీర్తనలు ఆలపిస్తూ తన్మయత్వం చెందుతున్నారు. అనేక చోట్ల పోస్టర్లపై ప్రధాని మోదీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను కూడా ముద్రించారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను కండ్లారా చూసేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు అయోధ్యకు వెల్లువెత్తారు. వెహికల్స్ లో కొందరు.. పాదయాత్రతో కొందరు.. స్కేటింగ్, సైక్లింగ్ చేస్తూ మరికొందరు తరలివచ్చారు.

5 లక్షల టెంపుల్స్ లో సంబురాలు: వీహెచ్ పీ 

రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఆలయాల్లో వేడుకలు జరుపుకొంటున్నారని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలతోపాటు 60కిపైగా దేశాల్లో వీహెచ్ పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంబురాలకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 

ప్రాణ ప్రతిష్ఠ కర్తలుగా14 జంటలు
 
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 14 జంటలు ప్రాణ ప్రతిష్ఠ క్రతువు కు కర్తలుగా వ్యవహరించనున్నారు. రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో తుది ఘట్టాన్ని వేద పండితులు, సాధువులు, పూజారులు సంప్రదాయ పూజలతో పూర్తి చేయనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత 7 వేల మంది ఆహ్వానితులతో జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

2.7 ఎకరాల్లో ఆలయ నిర్మాణం

అయోధ్యలోని రామ మందిరం కాంప్లెక్స్ చుట్టూ భారీ ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్ లో టెంపుల్ ఏరియా 2.7కుపైగా ఎకరాల్లో విస్తరించి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో గర్భగుడితోపాటు ఐదు గోపురాలతో ప్రత్యేక గుడులు నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకుని వెయ్యేండ్లు నిలిచేలా గుడిని నిర్మించామని రామ మందిరం నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. భూకంపాలతో గుడిపై పడే ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గుడి పునాదిలో ఎలక్ట్రానిక్ సెన్సర్లు ఉంచామని, వీటి నుంచి అందే డేటాను ఎప్పటికప్పుడు రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిపుణులు పరిశీలిస్తుంటారని తెలిపారు. ఇక ఫస్ట్ ఫ్లోర్​లో రామ్ దర్బార్ ఏర్పాటు కానుంది. ఇక్కడ రాముడితోపాటు సీత, లక్ష్మణ, భరత, శత్రఘ్ను, హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి. సెకండ్ ఫ్లోర్​లో ట్రస్టు అనుమతించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  గర్భగుడిలో బాల రాముడి కొత్త విగ్రహంతోపాటు బాల రాముడి పాత విగ్రహం కూడా కొలువుదీరనుంది. 

దేశంలోని  ప్రముఖ రామాలయాలు..

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రామాలయాలు ఎక్కడ ఉన్నాయంటే..

సీతారామ చంద్రస్వామి టెంపుల్, భద్రాద్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో  గోదావరి నది ఒడ్డున సీతారామ చంద్రస్వామి ఆలయం ఉంది. ప్రతి ఏడాది రామనవమి రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. 

రఘునాథ ఆలయం, జమ్మూ

ఇండియా నార్తర్న్ రీజియన్​లో ఉన్న జమ్మూ కాశ్మీర్​లో రఘునాథ ఆలయం ఉంది. 
 

రామరాజ టెంపుల్, మధ్యప్రదేశ్
 

మధ్యప్రదేశ్ ఓర్చాలోని బెత్వా నది ఒడ్డున రామరాజ ఆలయం ఉంటుంది. రాముడిని రాజుగా కూడా పూజించడం ఇక్కడి ప్రత్యేకత.

త్రిప్రయార్ శ్రీరామ దేవాలయం, కేరళ

కేరళలోని త్రిప్రయార్ శ్రీ రామ దేవాలయం త్రిసూర్ జిల్లాలో ఉంది. గుడిలోని విగ్రహం సముద్రంలో దొరికిందని, త్రిప్రయార్​లో ఓ మత్స్యకారుడు దీన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. 

కోదండ రామస్వామి ఆలయం

కర్నాటకలోని చిక్కమంగళూరులో కోదండ రామస్వామి దేవాలయం ఉంది. రాముడికి కుడి వైపు సీత, ఎడమ వైపు లక్ష్మణుడు ఉంటాడు.

రామస్వామి దేవాలయం, తమిళనాడు

తమిళనాడులోని  రామస్వామి దేవాలయం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి పొందింది.

స్పేస్ నుంచి చూస్తే ఇలా..

అయోధ్య ఆలయానికి సంబంధించిన ఫొటోలను ఇస్రో  రిలీజ్ చేసింది. శాటిలైట్ల సాయంతో స్పేస్ నుంచి రామ మందిరం ఫొటోలను తీసింది. గతేడాది డిసెంబర్ 16న తీసిన ఫొటోలు. అప్పటి నుంచి అయోధ్యలో దట్టమైన పొగమంచు వల్ల తాజా ఫొటోలు తీయడం వీలు కాలేదు. ఈ ​ఫొటోల్లో దశరథ్ మహల్, సరయూ నది స్పష్టంగా కనిపించాయి.

‘ఒంటరి  సీతమ్మ’ గుడిలో.. 

అయోధ్యలో వేడుకల నేపథ్యంలో మహారాష్ట్రలోని యావత్​మల్​లోని సీతమ్మ గుడిలోనూ సందడి నెలకొంది. ఈ గుడిలో లవకుశులతో కలిసి ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం మాత్రమే కొలువై ఉంది. దేశంలో ఇలా సీతమ్మ ఒంటరిగా ఉన్న ఏకైక గుడిగా ఇది ప్రసిద్ధి చెందింది. గుడి ఆధ్వర్యం లో మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతుండటం మరో విశేషం.