పదేళ్లలో అయోధ్యకు రూ.85 వేల కోట్లు .. 1,200 ఎకరాల్లో టౌన్​షిప్​

పదేళ్లలో అయోధ్యకు రూ.85 వేల కోట్లు ..  1,200 ఎకరాల్లో టౌన్​షిప్​

న్యూఢిల్లీ: భారీ నిధులు రావడం వల్ల అయోధ్య నగరం మరింత అందంగా ముస్తాబు కాబోతోంది. మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం అయోధ్య పునరాభివృద్ధి 10 సంవత్సరాలలో పూర్తవుతుంది. ఇందుకోసం రూ. 85 వేల కోట్ల పెట్టుబడి పెడతారు.  రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ ఇక్కడికి దాదాపు 3 లక్షల మంది వస్తారని అంచనా. ఈ ప్రణాళికలో భాగంగా 1,200 ఎకరాల్లో ప్రత్యేక కొత్త టౌన్‌‌షిప్​ను అభివృద్ధి చేస్తారు. ఇది దాదాపు రూ. 2,200 కోట్ల పెట్టుబడితో వచ్చే ఐదేళ్లలో పూర్తవుతుంది. ఈ గ్రీన్‌‌ఫీల్డ్ టౌన్‌‌షిప్‌‌కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 

 ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వ ఆస్తులు ఉండటంతోపాటు  రామ మందిర ప్రతిష్ఠాపన వల్ల నగరం ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక సిద్ధం చేసినట్లు వర్గాలు తెలిపాయి. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అయోధ్య డెవలప్‌‌మెంట్ అథారిటీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్డ్ సిటీ ప్రాంతం 133 చదరపు కిలోమీటర్లు,  కోర్ సిటీ 31.5 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అయోధ్యకు విజన్ డాక్యుమెంట్‌‌ను రూపొందించిన దిక్షు కుక్రేజా మాట్లాడుతూ అయోధ్యలో అన్ని రకాల ప్రపంచస్థాయి సదుపాయాలు ఉంటాయని చెప్పారు.   

అంచనాల ప్రకారం, రామమందిరం  పునరాభివృద్ధిని పూర్తి చేసిన తర్వాత, నగరంలో నివాసితులు  పర్యాటకులు 1:10 నిష్పత్తిలో ఉండే అవకాశం ఉంది. అంటే భారీ సంఖ్యలో ఈ నగరం యాత్రికులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. సందర్శకుల అన్ని అవసరాలను తీర్చడానికి గ్రీన్‌‌ఫీల్డ్ టౌన్‌‌షిప్‌‌లో స్టేట్ గెస్ట్ హౌస్‌‌లు, హోటళ్లు,   వాణిజ్య సముదాయాలను నిర్మిస్తారు. ప్రధాన పర్యాటక ఆకర్షణలలో నగరం  వారసత్వ ఆస్తుల రక్షణ, పునర్నిర్మాణం,  కోర్ సిటీ పునరాభివృద్ధి ఉన్నాయి. ఈ ప్రణాళికలో తగిన సౌకర్యాలతో మూడు వృత్తాకార రహదారుల (పరిక్రమ మార్గ్) అభివృద్ధి కూడా ఉంది.