ఇరాక్‌ కొండల్లో రాముడు!.. కనుగొన్న భారత పురావ‌‌స్తు శాఖ

ఇరాక్‌ కొండల్లో రాముడు!.. కనుగొన్న భారత పురావ‌‌స్తు శాఖ

హోరేన్​షేక్​ కొండల్లో మ్యూరల్‌ పెయింటింగ్‌

ఇండియా, ఇరాక్‌‌ చారిత్రక సంబంధాలకు బలమైన ఆధారం లభించింది. మన దేశం నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాక్‌‌లో రాముడి ఆనవాళ్లను కనుగొన్నారు. హోరేన్​షేక్‌‌ ప్రాంతంలోని దర్బండ్ ఐ బెలూలా కొండ మీదున్న రాయిపై రాముడి రూపంలో ఉన్న బొమ్మను (మ్యూరల్‌‌ పెయింటింగ్‌‌) గుర్తించారు. ఇరాక్‌‌లో ఇటీవల పర్యటించిన భారత పురావ‌‌స్తు శాఖ ప్రతినిధులు ఈ పెయింటింగ్‌‌ను చూశారు. ఇది క్రీస్తు పూర్వం 2 వేల ఏళ్ల నాటిదని అంచ‌‌నా వేస్తున్నారు. ఆ బొమ్మలోని నిల్చున్న వ్యక్తి బాణం ప‌‌ట్టుకుని ఉన్నాడు. ఆయ‌‌న వెనుక బాణాలు పెట్టుకునే అమ్ముల‌‌ పొది, న‌‌డుముకు చిన్న క‌‌త్తి ఉంది. ఆయన ఎదుట మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వీళ్లిద్దరినీ చూస్తూంటే రామ, హనుమంతుల్లా ఉన్నారని ఇండియా ప్రతినిధులు అంటున్నారు. ఇరాక్ చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు మాత్రం ఆ బొమ్మకు రాముడితో సంబంధం లేదంటున్నారు. అది కొండజాతి రాజు తర్దున్ని బొమ్మని చెబుతున్నారు. ఇరాక్‌‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి బొమ్మలున్నాయని చెప్పారు. ఆ బొమ్మల్లో నిల్చున్న వ్యక్తి రాజని, ఆయన ఎదుట మోకాలిపై ఉన్న వాళ్లు ఖైదీలని తెలిపారు.

యూపీ కల్చరల్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో..

ఉత్తరప్రదేశ్‌‌ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని అయోధ్య శోధ్ సంస్థాన్ భారత ప్రతినిధుల బృందాన్ని ఇరాక్‌‌కు పంపింది. ఇరాక్‌‌లో ఇండియా రాయబారి ప్రదీప్ సింగ్ రాజ్‌‌పురోహిత్ ఈ బృందానికి నేతృత్వం వహించారు. ఇబ్రిల్ కాన్సులేట్‌‌లోని రాయబారి చంద్రమౌళి కరణ్​, సులేమానియా యూనివర్సిటీకి చెందిన చరిత్రకారులు, ఇరాక్ ప్రభుత్వాధికారులూ బృందంలో ఉన్నారు. ఇరాక్‌‌లో కనుగొన్న బొమ్మ రాముడిదేనని సంస్థాన్  డైరెక్టర్ యోగేంద్ర ప్రతాప్ సింగ్ అంటున్నారు. ‘బెలూలా కనుమలో రాముడి పోలికలకు సంబంధించిన చారిత్రక ఆధారాలున్నాయి. ఇండియా, మెసపటోమియా నాగరికతల సంబంధం గురించి లోతుగా తెలుసుకోవడానికి ఆధారాలను బృందం సేకరిస్తోంది’ అని సింగ్‌‌ తెలిపారు. ఇరాక్ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక మ్యూరల్‌‌ పెయింటింగ్‌‌ గురించి పూర్తిగా అన్వేషిస్తామని సింగ్‌‌ చెప్పారు. సింధూ లోయ (ఇండస్‌‌ వ్యాలీ), మెసపటోమియా నాగరికతల మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి ఇది తొలి అధికారిక ప్రయత్నమన్నారు. క్రీస్తుపూర్వం 4500 నుంచి 1900 మధ్య లోయర్‌‌ మెసపటోమియాను సుమేరియన్లు పాలించారని గుర్తు చేశారు. వాళ్ల మూలాలు సింధూలోయ నాగరికతతో ముడి పడి ఉండొచ్చని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రాముడిని పోలిన బొమ్మలు, విగ్రహాలు కనిపించినా వాటి నకళ్లను తయారు చేసి అయోధ్యలో అందరికీ అందుబాటులో ఉంచాలని యూపీ సాంస్కృతిక శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇరాక్‌‌లో ఉన్న బొమ్మ లాంటి విగ్రహాన్ని చేయించాలనుకుంటోంది.