జై శ్రీరాం : అయోధ్యలో ప్రతిష్టించే రామ లక్ష్మణ సీత విగ్రహాలు ఇవే

జై శ్రీరాం : అయోధ్యలో ప్రతిష్టించే రామ లక్ష్మణ సీత విగ్రహాలు ఇవే

కర్నాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 'రామ్ లల్లా' విగ్రహాన్ని అయోధ్యలోని గొప్ప రామాలయంలో ప్రతిష్టించనున్నారు. యోగిరాజ్ స్వస్థలం మైసూరు. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య ఆలయంలో ప్రతిష్టించేందుకు ఎంపిక చేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జనవరి 1న ప్రకటించారు.

రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడే హనుమంతుడు ఉంటాడని, అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కోసం ఈ విగ్రహం ఎంపిక ఖరారైందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ లో పోస్ట్ చేశారు. మన దేశం గర్వించదగ్గ ప్రముఖ శిల్పి శ్రీ అరుణ్ యోగిరాజ్ అన్న ఆయన.. అరుణ్ చెక్కిన ఈ శ్రీరాముని విగ్రహమే అయోధ్యలో ప్రతిష్టించబడుతుందని స్పష్టం చేశారు. రామ హనుమంతునికి ఉన్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ అని చెప్పారు.  

'ఇంకా అధికారిక సమాచారం రాలేదు': అరుణ్ యోగిరాజ్

అరుణ్ యోగిరాజ్ తాను చెక్కిన విగ్రహం అంగీకరించబడిందా లేదా అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదని అన్నారు. 'రామ్ లల్లా' విగ్రహాన్ని చెక్కడానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఎంపిక చేసిన ముగ్గురు శిల్పులలో తానూ ఒక్కడినన్నారు. అందుకు సంతోషంగా ఉందని యోగిరాజ్ అన్నారు. దాదాపు 7నెలలు శ్రమించి తాను ఈ విగ్రహాన్ని రూపొందించానని, తనను ఎంపిక చేయడం కన్నా.. ఈ విగ్రహాన్ని అందరూ మెచ్చుకున్నప్పుడే తనకు అసలైన ఆనందమని తెలిపారు. కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని, ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రఖ్యాత శిల్పి, ఈ పని సవాలుతో కూడుకున్నదని అంగీకరించారు.