
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడింది.దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న ఈకేసుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ పరిష్కారం చూపింది. అయోధ్యలోని వివాదాస్పదభూమి హిందువులదేనని, మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ఐదెకరాలస్థలం కేటాయించాలని కేం ద్రప్రభుత్వం,యూపీ సర్కార్లను ఆదేశించింది.ఇంతటి వివాదాస్పద కేసులో తుదితీర్పును జడ్జీలంతా ఏకాభిప్రాయంతో వెల్లడించారు.
సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
జస్టిస్ గొగోయ్ 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రుగఢ్‌లో పుట్టారు. 1978లో బార్ కౌన్సిల్లో నమోదు చేసుకుని గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 ఫిబ్రవరి 28న గౌహతి హైకోర్టులో శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. 2010లో పంజాబ్–హర్యానా హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. 2011లో పంజాబ్–హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2012లో సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు. 2018 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే
జస్టిస్ రంజన్ గొగోయ్ తర్వాత సీజేఐ అయ్యేది జస్టిస్ బోబ్డేనే. 1956 ఏప్రిల్ 24న నాగ్‌పూర్‌లో పుట్టారు. 1978 నుంచి బాంబే హైకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టి, అదే హైకోర్టులో జడ్జి అయ్యారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది. బోబ్డే అయోధ్య కేసుతో పాటు రైట్ టు ప్రైవసీ సహా ఎన్నో కీలక కేసులపై తీర్పు ఇచ్చారు. గొగోయ్‌పై వచ్చిన అత్యాచార వేధింపుల కమిటీకి జస్టిస్ బోబ్డే నేతృత్వం వహించారు.
జస్టిస్ ధనుంజయ యశ్వంత్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడే జస్టిస్ డీవై చంద్రచూడ్. 1959 నవంబర్ 11న ముంబైలో పుట్టారు. 2000లో బాంబే హైకోర్టు జడ్జీగా నియమితులయ్యారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మేలో సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతిపై వచ్చారు. రైట్ టు ప్రైవసీ, శబరిమలలో మహిళల ప్రవేశం, ఆధార్ స్కీమ్ వ్యాలిడిటీ తదితర అంశాల్లో కీలక తీర్పులను వెలువరించారు.
జస్టిస్ అశోక్భూషణ్
ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో 1956 జులై 5న పుట్టారు. 1979లో యూపీ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2001లో అలహాబాద్ హైకోర్టులో శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ భూషణ్.. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతిపై వచ్చారు. పాన్‌కు ఆధార్ లింకేజ్‌ను తప్పనిసరి చేయడంపై తాత్కాలిక స్టే ఇచ్చిన బెంచ్‌లో ఉన్నారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్
కర్నాటకలోని బెలగావిలో 1958 జనవరి 5న జన్మించారు. 1983లో లాయర్‌గా రిజిస్టర్ అయ్యి.. కర్నాటక హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2003లో కర్నాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏ హైకోర్టులోనూ ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందిన మూడో వ్యక్తి జస్టిస్ నజీర్. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ బద్ధతను నిర్ణయించే బెంచ్‌లో ఉన్నారు.