ఒక్క నెలలో .. అయోధ్య రాముడికి రూ.25 కోట్ల విరాళాలు

ఒక్క నెలలో ..  అయోధ్య రాముడికి రూ.25 కోట్ల విరాళాలు

ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన  అయోధ్య రామాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తుతున్నారు. బాల రాముడిని దర్శించుకుని విరాళాలు  అందజేస్తున్నారు.  నెల రోజుల వ్యవధిలో అయోధ్య ఆలయానికి  రూ.25 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. ఈ విషయాన్ని  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఇందులో 25 కిలోల బంగారు, వెండి ఆభరణాలూ ఉన్నట్లు వెల్లడించింది. 

జనవరి 23 నుంచి దాదాపు 60 లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నారని  రామాలయం  ట్రస్ట్ కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా  తెలిపారు.  శ్రీరామనవమి రోజున 50 లక్షల మందికి పైగా భక్తులు  బాల రాముడిని దర్శించుకుంటారని అంచనా వేశారు.   రామనవమి సందర్భంగా  విరాళాల స్వీకరణకు ఇబ్బందులు తలెత్తకుండా  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామజన్మభూమిలో నాలుగు ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను ఏర్పాటు చేసిందని గుప్తా తెలిపారు. 

అంతేకాకుండా  రసీదుల జారీకి 10కి పైగా కంప్యూటర్‌ కౌంటర్లు, అదనపు హుండీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  భక్తులు కానుకగా ఇచ్చే బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువుల మదింపు, వాటిని కరిగించడం, నిర్వహణను భారత ప్రభుత్వ టంకశాలకు అప్పగించినట్లు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు.

 అదేవిధంగా.. విరాళాలు, చెక్కులు, డ్రాఫ్ట్‌లు, నగదు సేకరణ, వాటిని బ్యాంకులో జమ చేయడం వంటి బాధ్యతలను ఎస్బీఐకి అప్పగించినట్లు.. ఈ మేరకు బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. విరాళంగా ఇచ్చిన నగదును ప్రతిరోజూ రెండు షిఫ్టులలో లెక్కించడం జరుగుతుందని మిశ్రా చెప్పారు.