Thamma Box Office: రష్మిక ‘థామా’ షాకింగ్ వసూళ్లు.. మాడాక్ హారర్ యూనివర్స్ అంచనాలు అందుకుందా?

Thamma Box Office: రష్మిక ‘థామా’ షాకింగ్ వసూళ్లు.. మాడాక్ హారర్ యూనివర్స్ అంచనాలు అందుకుందా?

భారీ అంచనాల మధ్య రిలీజైన రష్మిక మందన్న లేటెస్ట్ మూవీ ‘థామ’(Thamma). ఆదిత్య సర్పోత్దార్ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించగా.. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, వరుణ్ థావన్ కీలక పాత్రలు పోషించారు.

మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో నాల్గవ భాగంగా వచ్చిన ‘థామ’.. మంగళవారం (అక్టోబర్ 21న) భారీ బజ్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రష్మిక క్రేజ్, మాడాక్‌ వరుస హార్రర్ ఫిల్మ్స్‌ క్రేజీ దృష్ట్యా.. ఫస్ట్ డే మంచి బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో లేటెస్ట్గా ‘థామ’ తొలిరోజు వసూళ్లను ప్రకటిస్తూ, మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘థామ’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రూ.25.11 కోట్ల నెట్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

‘‘మాడాక్ ఫిల్మ్స్‌కు థామ మూడవ అత్యధిక ఓపెనర్. స్త్రీ 2 తర్వాత ఈ యూనివర్స్లో రెండవ అత్యధికం. ఆయుష్మాన్‌ ఖురానా కెరీర్‌లో మొదటిరోజు ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన తొలి చిత్రం థామ" అని మేకర్స్ వెల్లడించారు. ఆయుష్మాన్‌ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ 2 తొలి రోజు రికార్డులను ‘థామ’ అధిగమించింది.

మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్:

థామ సినిమాకు మిక్సెడ్ టాక్ రావడంతో తొలిరోజు కలెక్షన్లపై ప్రభావం పడింది. అయినప్పటికీ.. ఈ మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ చుట్టూ ఉన్న బజ్‌ను క్యాష్ చేసుకోనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గత సంవత్సరం సర్పోత్‌దార్ దర్శకత్వం వహించిన లాస్ట్ మూవీ ముంజ్య విషయంలో కూడా ఐదే జరిగింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మెల్ల మెల్లగా ప్రారంభమైంది. ఇది ఫస్ట్ డే ఇండియాలో రూ.4 కోట్లతో స్టార్ట్ అయింది. కానీ, దేశీయ బాక్సాఫీస్ వద్ద వేగం పుంజుకుని, దాదాపు ఆరు వారాల తర్వాత రూ.101.60 కోట్లతో ముగించింది. ఇపుడు ‘థామ’ పరిస్థితి కూడా ఇలానే ఉండొచ్చని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. 

అయితే, మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో వచ్చిన ‘స్త్రీ2’ విడుదలైన తొలి రోజున రూ.51.80 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది. ఓవరాల్ గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.884.45 కోట్ల వసూళ్లను సాధించింది. ఇండియాలో రూ.562.24 కోట్ల నెట్ వసూళ్లను వసూలు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో రూ.144 కోట్లు సంపాదించింది. ఈ క్రమంలో స్త్రీ2 ప్రపంచవ్యాప్తంగా ఏడవ అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ‘థామ’ మూవీ శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ2 అంచనాలను అందుకోవడం చాలా కష్టమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 

కథేంటంటే: 

ఆజాద్ అనే టీవీ ఛానల్లో అలోక్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ రిపోర్టర్. తన తోటి మిత్రులతో కలిసి ఓ పర్వత ప్రాంతానికి న్యూస్‌ కవరేజ్‌ కోసం వెళతాడు. అలా దట్టమైన అడవిలోకి వెళ్లిన అలోక్ కి ఓ ప్రమాదం ఎదురవుతుంది. ఈ క్రమంలో అలోక్ని బేతాళ జాతికి చెందిన అమ్మాయి తడ్కా (రష్మిక మందన్న) రక్షిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్, తడ్కా ప్రేమించుకుంటారు. అలా అలోక్పై ఇష్టంతో బేతాళజాతిని వదిలేసి.. అతడితో జనాల్లోకి వెళ్తుంది. అయితే, తడ్కా ఒక బేతాళిని అనే విషయం అలోక్కి చాలా లేట్గా తెలుస్తుంది. ఈ జర్నీలో వీరిమధ్య చాలా జరుగుతుంది. ఈ క్రమంలోనే బేతాళుల నుంచి తడ్కకి పిలుపు రావడం, అదే టైంలో ఒక యాక్సిడెంట్లో అలోక్ చనిపోవడం జరుగుతుంది.

ఈ విషయం తెలుసుకున్న తడ్కా ఏం చేసింది? అలోక్‌కు తడ్కా ఓ బేతాళిని అని ఎలా తెలిసింది? అసలు బేతాళులు ఎవరు? ఎప్పట్నుంచి ఈ భూమ్మీద ఉంటున్నారు? బేతాళుల జీవిత లక్ష్యం ఏంటీ? ఇంతకు అలోక్ నిజంగానే చనిపోయాడా? ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్‌ (నవాజుద్దీన్‌ సిద్ధిఖీ), బేతాళుల చేతిలో ఎందుకు బందించబడ్డాడు? ఈ కథకు మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో ‘భేడియా’, ‘ముంజ్యా’, ‘స్త్రీ 2’ చిత్రాలతో ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ‘థామ’ చూడాల్సిందే!