తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి గుడి దగ్గర అయ్యప్ప భక్తుల ఆందోళన

తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి గుడి దగ్గర అయ్యప్ప భక్తుల ఆందోళన

అమరావతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ పుష్కరిణి దగ్గర అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. పుష్కరిణిలో స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడంతో టీటీడీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన చేశారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలు, దీపారాధనకు టీటీడీ భక్తులను అనుమతించడం లేదు. అయితే.. ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ విజిలెన్స్ సిబ్బంది కోనేరులోకి భక్తులను అనుమతించకపోవడంపై స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజిలెన్స్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డ భక్తులు.. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. ప్రతి రోజూ స్నానాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప భక్తుల ఆందోళనతో కపిలేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భక్తుల ఆందోళనతో దిగివచ్చిన టీటీడీ అధికారులు అయ్యప్ప భక్తులు స్నానాలకు అనుమతి ఇచ్చారు. కోనేరులో స్నానాలకు అనుమతించడంతో స్వాములు శాంతించి ఆందోళన విరమించారు.