మోడీ, కేసీఆర్ డిక్టేటర్లు.. ఓడించాలి : చేవెళ్లలో ఆజాద్

మోడీ, కేసీఆర్ డిక్టేటర్లు.. ఓడించాలి : చేవెళ్లలో ఆజాద్

రంగారెడ్డి జిల్లా మన్నెగూడా..  మిర్జాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, చేవెళ్ళ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ , పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పాల్గొన్నారు.

కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటున్నారు : ఆజాద్

గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. “ evm మిషన్ లను మేము తీసుకువస్తే.. ఇప్పటి ప్రభుత్వం వాటిని ట్యాపింగ్ చేసింది. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 108, దళితులకు భూ పంపిణీ, రుణమాఫీ పథకాలను అమలుచేశాం.  హైదరాబాద్,బెంగళూరు కు ఐటీ హబ్ తీసుకువచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మోడీ హయాంలో.. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఈడీ కేసు ఉంది కాబట్టే.. మోడీకి కేసీఆర్ భయపడుతున్నారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయి. మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటే. డిక్టేటర్ లాంటి వాళ్లయిన మోడీ, కేసీఆర్ ల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి” అన్నారు.

రాష్ట్రంలో రెండో పార్టీ ఉండొద్దా : కోదండరాం

ప్రతిపక్షం లేకుండా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. మందు, పైసలు ఇస్తే తీసుకుని మంచి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి ఓట్ వేయండి అని చెప్పారు. ఇక్కడ భూములు కొనుక్కుని వ్యాపారం చేసే రంజిత్ రెడ్డి ఓట్ వేస్తారా… రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం ఉద్యమించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి ఓట్ వేద్దామా మీరే ఆలోచన చేయాలన కోదండరామ్ అన్నారు.

ఆ రెండో ఎంపీని నేనే. నేనంటే కేసీఆర్ కు భయం : విజయశాంతి

ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మోడీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్నవే అన్నారు. మోడీ నోట్ల రద్దుతో వ్యవస్థలు ధ్వంసం చేశారనీ… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 72,000 రూపాయలు  అందుతాయని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన చెట్లు, గొర్రెలు, చేపలు ఏవీ బ్రతకడం లేదన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ పోరాటం చేశానని చెప్పుకునే కేసీఆర్… ఆ రెండో ఎంపీ విజయశాంతి అని ఒక్కమాట కూడా చెప్పలేడు.. తానంటే కేసీఆర్ కు భయం అని అన్నారు విజయశాంతి. కారు ఓవర్ లోడ్ అయ్యింది పంక్చర్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.

543 సీట్లలో 16 సీట్లు వస్తే ఢిల్లీలో చక్రం ఎట్లా తిప్పుతారు…  బొంగరం కూడా తిప్పలేరని విమర్శించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 3 లక్షల మెజార్టీతో ఎంపీగా గెలవబోతున్నానని ధీమాగా చెప్పారు. .