B Saroja Devi: స్వర్ణయుగం ముగిసింది.. లెజెండరీ నటి సరోజా దేవి మృతిపై ప్రముఖుల సంతాపం

B Saroja Devi: స్వర్ణయుగం ముగిసింది.. లెజెండరీ నటి సరోజా దేవి మృతిపై ప్రముఖుల సంతాపం

ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు చనిపోయిన మరుసటి రోజే, మరో లెజండరీ నటి కన్నుమూశారు. బి.సరోజాదేవి 87 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ (JULY14న) తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం దక్షిణ భారత సినీ రంగానికి తీరని లోటని, ఒక శకం ముగిసిందని సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

సరోజాదేవి కన్నుమూశారని తెలిసి బాధపడ్డానని నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ‘‘ప్రముఖ నటి శ్రీమతి బి.సరోజాదేవి గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారు.

భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. శ్రీమతి బి.సరోజా దేవి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’అని పవన్ కళ్యాణ్ Xవేదికగా పవన్ కళ్యాణ్ తెలిపారు.

సరోజాదేవి నటనను గుర్తుచేసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.  ‘‘ప్రముఖ కన్నడ నటి బి. సరోజాదేవి మరణవార్త బాధాకరం. కన్నడ సినిమాతో సహా తమిళం, తెలుగు మరియు హిందీ భాషలలో సుమారు 200 చిత్రాలలో నటించిన ఆమె అభినయ సరస్వతిగా ప్రసిద్ధి చెందింది. సరోజాదేవి గురించి ఆలోచించినప్పుడు, కిత్తూరు చెన్నమ్మ, బబ్రువాహన, అన్నతంగి వంటి చిత్రాలలో ఆమె ఆకర్షణీయమైన నటన గుర్తుకు వస్తుంది.

దశాబ్దాలుగా తన అభిరుచి గల చిత్రాలతో సినీ ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. సరోజా దేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. దుఃఖంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు నా సానుభూతి’’అని కర్ణాటక ముఖ్యమంత్రి Xవేదికగా తెలిపారు. 

‘సినీ పరిశ్రమలో స్వర్ణయుగం ముగిసింది. దక్షిణాదిలో మరే ఇతర మహిళా నటి ఆమె లాంటి పేరు మరియు కీర్తిని ఆస్వాదించలేదు. ఆమెతో గొప్ప అనుబంధం ఉంది. ఎప్పుడు బెంగళూరుకు వెళ్లినా ఆమెను కలిసేదాన్ని. చెన్నైలో ఎప్పుడు వచ్చినా, ఆమె ఫోన్ చేసి నన్ను కలిసేవారు. ఆమెను చాలా మిస్ అవుతాను. అమ్మకు శాంతి కలగాలి’ అని నటి ఖుష్బూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. 

నటుడు కమల్ హాసన్ X వేదికగా తనతో సరోజా దేవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  ‘‘ సరోజా దేవి నాకు తల్లితో సమానం.  ఆమె నన్ను ఎక్కడ చూసినా, ఏ వయసులోనైనా నా చెంపను వేలితో తడిమేది. నన్ను "ప్రియమైన కొడుకు" అని పిలిచేది. భాష లేదా ప్రాంతీయ సరిహద్దులు లేకుండా జీవించిన నటి సరోజా దేవి. 

►ALSO READ | Rajamouli: రాజమౌళి గ్లోబల్ సెన్సేషన్.. జపాన్ వీడియో గేమ్‌లో ప్రత్యేక పాత్ర, వైరల్ !

నా రెండవ చిత్రం 'పార్థల్ పసి తిరుమ్' షూటింగ్ క్షణాల నుండి మొదలుకొని, ఎన్నో మరపురాని జ్ఞాపకాలు నా మనసును ముంచెత్తుతున్నాయి. ఆమె లేరని వార్తాతో నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆమె ఎప్పుడూ నన్ను సినిమా రంగంలో మొదటిస్థానంలో చూడాలని కోరుకునేది. మా అమ్మకు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను’’ అని కమల్ హాసన్ భావోద్వేగం అయ్యారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ తన సంతాపాన్ని X వేదికగా తెలిపారు. ‘లక్షలాది మంది అభిమానుల హృదయాలను దోచుకున్న మహానటి సరోజా దేవి ఇప్పుడు మనతో లేరు. ఆమె ఆత్మకు శాంతి చేకూరుగాక’ అని పోస్ట్ చేశారు.

సరోజా దేవి తన 17 సంవత్సరాల వయస్సులోనే సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడ మూవీ మహాకవి కాళిదాస (1955) ద్వారా ఎంట్రీ ఇచ్చి నేషనల్ అవార్డును సైతం సాధించింది. నట దిగ్గజాలు ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాల్లో సరోజా దేవి నటించి గుర్తింపు సంపాదించుకుంది. ఆమెను తమిళంలో కన్నడత్తు పైంగిలి (కన్నడ చిలుక) అని, కన్నడలో అభినయ సరస్వతి (భావాల సరస్వతి) అని పిలుస్తారు. 2009లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఆమెను వరించింది. సరోజాదేవి సినిమా రంగానికి చేసిన సేవలకుగానూ కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.