
తెలంగాణ డీజీపీగా బి.శివధర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) శివధర్ రెడ్డికి డీజీపీ నియామకపత్రాన్ని అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు.
సెప్టెంబర్ నెలాఖరున ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీ కాలం పూర్తవుతుంది. ఈ క్రమంలో తదుపరి డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన జీవీ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
హైదరాబాద్‌లో జన్మించిన బత్తుల శివధర్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామం. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లోనే ఆయన చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలు అందించారు.
వివిధ హోదాల్లో పనిచేసిన శివధర్ రెడ్డి.. మావోయిస్లు అణచివేతలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ తొలి ఇంటెలిజిన్స్ చీఫ్ గా పనిచేశారు. 2016 నయీం ఎన్ కౌంటర్ లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాను కలిగి ఉన్నారు .