బాబ్లీ గేట్లు ఓపెన్.. గోదావరిలోకి 0.2 టీఎంసీల నీటి విడుదల

బాబ్లీ గేట్లు ఓపెన్.. గోదావరిలోకి 0.2 టీఎంసీల నీటి విడుదల
  • ఎస్సారెస్పీకి ప్రయోజనం

నిజామాబాద్/బాల్కొండ, వెలుగు: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు కలిసి ఓపెన్​ చేశారు. మొత్తం 14 గేట్లను ఎత్తగా 0.2 టీఎంసీల నీరు గోదావరి నదిలో ప్రవహిస్తున్నది. దీంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి స్వల్పంగా నీళ్లు చేరే వీలుకలిగింది. పోచంపాడ్​ ఎస్​ఈ శ్రీనివాస్​గుప్తా, ఈఈలు వెంకటేశ్వర్లు, చక్రపాణి, నాందేడ్​ ఈఈ బన్సోద్​, ఏఈఈలు సతీశ్​, వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జులై 1 నుంచి అక్టోబర్ 28 దాకా మొత్తం 120 రోజుల పాటు బాబ్లీ గేట్లన్నింటినీ ఓపెన్  పెట్టాలి. గోదావరిలో వరద నీటిని ఎగువన ఎవరూ అడ్డుకోకుండా 2013లో కోర్టు ఇచ్చిన తీర్పును రెండు రాష్ట్రాల ఇంజనీర్లు అమలు చేస్తున్నారు. 

ఎస్సారెస్పీలో ప్రస్తుతం 10 టీఎంసీలు ​

ఎస్సారెస్పీలో పూర్తి స్టోరేజీ కెపాసిటీ 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.474 టీఎంసీల నీటి నిలువ ఉంది. నిరుడు ఈ టైంలో 15 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. సోమవారం పొద్దున వరకు 3,935 క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహిస్తుండగా.. బాబ్లీ గేట్లు ఎత్తినందున మరికొంత ప్రవాహం జతకలిసి ఎస్సారెస్పీకి ప్రయోజనం కలుగనుంది. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు ఎంత భారీగా కురిస్తే అంత మేరకు నీరు 120 రోజుల పాటు బాబ్లీ మీదుగా ఎస్సారెస్పీకి నీళ్లు చేరుతాయి. ఓపెన్​ చేసిన గేట్లను అక్టోబర్ 29న క్లోజ్​ చేస్తారు.