గాయాలను కెలికేందుకే మోడీ విశాఖ టూర్ : చంద్రబాబు

గాయాలను కెలికేందుకే మోడీ విశాఖ టూర్ : చంద్రబాబు

అమరావతి : టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్తి చేశారు చంద్రబాబు. అన్ని ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లలో టీడీపీపై జనంలో పూర్తి సానుకూలత ఉందని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. “ఇంకా 13 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేయాలి.  ఈ ఎన్నికలు TDPకే కాదు రాష్ట్రానికే కీలకం. ధర్మపోరాట నిరసనలతో రాష్ట్రం హోరెత్తాలి.  నేను కూడా నల్ల చొక్కా ధరిస్తాను. రాష్ట్రవ్యాప్తంగా నల్లచొక్కాలతో … నల్ల బెలూన్లు, నల్లజెండాలతో నిరసన తెలపాలి. నరేంద్ర మోడీ విశాఖ రాకను అందరూ నిరసించాలి. మనకు తీరని అన్యాయం చేశారు. 5కోట్ల ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు.  గాయాలను కెలికేందుకే మోడీ విశాఖ వస్తున్నారు. మన గాయాలపై కారం జల్లడానికే మోడీ వస్తున్నారు. మోడీ తిరిగి వెళ్లేదాకా నిరసనల జోరుతో హోరెత్తాలి. బహిరంగ లేఖలో మోడీ ఏపీకి చేసిన ద్రోహాన్ని నిలదీశాను. 5ఏళ్లలో ప్రధాని చేసిన అన్యాయాన్ని నిగ్గదీశాను. విశాఖ రైల్వే జోన్ మోడీ మోసపూరిత నిర్ణయం. ఆదాయం లేని జోన్ ఇచ్చి.. బీజేపీ కుట్రపూరిత నిర్ణయం తీసుకుంది. మన ఆదాయాన్ని కూడా ఒడిశాకు ఇచ్చారు.  జోన్ అడిగితే డివిజన్ కూడా తీసేశారు. రాబడి లేని మాయా జోన్ ను మనకు ఇచ్చారు. దీనిని రాష్ట్రంలో అందరూ ఖండించాలి, మోడీ నమ్మకద్రోహాన్ని నిలదీయాలి” అని చంద్రబాబు అన్నారు.